ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం అత్యంత ప్రధానం

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పాలనకు జవాబుదారీతనం అత్యంత ప్రధానమైన అంశమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉద్ఘాటించారు. ప్రజాపద్దుల కమిటీ (పిఎసి) వంద వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం పార్లమెంటులోని సెంట్రల్‌ హాల్‌లో శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రారంభించారు.
 
 ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, పార్లమెంట్‌ పిఎసి చైర్మన్‌ అధిర్‌ రంజన్‌ చౌదరి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌, కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర శాసనసభల స్పీకర్లు, రాష్ట్రాల పిఎసి చైర్మన్లు హాజరయ్యారు. వందేళ్ల ప్రస్థానానిు ప్రతిబింబిస్తూ రూపొందించిన పిఎసి సెంటెనియల్‌ సావనీర్‌ను రాష్ట్రపతి ఆవిష్కరించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పార్లమెంటు ప్రజల సంకల్పానికి ప్రతిరూపమని, పార్లమెంటరీ కమిటీలు దాని విస్తరణగా పనిచేస్తాయని పేర్కొన్నారు. నిధుల సేకరణ, ఖర్చు చేయడానికి కార్యనిర్వాహక విభాగానికి అనుమతి ఇచ్చేది పార్లమెంటే కాబట్టి, ఆ నిధులను తదనుగుణంగా ఖర్చు చేశారా? లేదా? అని అంచనా వేయాల్సిన బాధ్యత పార్లమెంటుదేనని ఆయన తెలిపారు. 
 
పార్లమెంటరీ కమిటీలు, ముఖ్యంగా పిఎసి శాసన వ్యవస్థ పట్ల కార్యనిర్వాహకవర్గానికి జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తాయని కోవిద్‌ చెప్పారు. పార్లమెంటరీ కమిటీలు, పిఎసిలు లేకపోతే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అసంపూర్ణమవుతుందని స్పష్టం చేశారు. 
 
పిఎసి ద్వారానే పౌరులు ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులను తనిఖీ చేస్తారని తెలిపారు. మహాత్మా గాంధీ ఆశయాల, అంచనాలకు అనుగుణంగా పిఎసి పనిచేస్తోందని చెప్పారు.  అక్రమాలు, లోటుపాట్లను గుర్తించడం కోసం ప్రభుత్వ వ్యయాలను పిఎసి పరిశీలిస్తుందని అంటూ, ఈ కమిటీ కేవలం న్యాయపరమైన కోణంలోనే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థ, వివేకం, జ్ఞానం, ఔచిత్యం దృష్టితో కూడా దీన్ని పరిశీలించాలని పేర్కొన్నారు.
ఉచితాలపై విస్తృత చర్చ జరగాలి

సంక్షేమ బాధ్యతలను అభివృద్ధి అవసరాలతో ముడిపెట్టి ప్రభుత్వాలు ఉచిత తాయిలను ప్రకటించడంపై విస్తృత స్థాయి చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ సందర్భంగా సూచించారు. 

విస్తృతస్థాయి చర్చ జరగడానికి వీలుగా పార్లమెంటుకు చెందిన ప్రజాపద్దుల కమిటీ (పిఎసి) దీన్ని పరిశీలించాలని ఆయన కోరారు. ఏడాదికి కనీసం 100 రోజులు పార్లమెంటు, రాష్ట్రాల చట్ట సభలు 90 రోజులు సమావేశం కావాలని ఉపరాష్ట్రపతి స్పష్టం చేస్తూ, ఈ అంశంపై రాజకీయ ఏకాభిప్రాయం ఉండాలని పేర్కొన్నారు. 

పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీతో పాటు పబ్లిక్‌ ఎస్టిమేట్స్‌ కమిటీ, పబ్లిక్‌ అండర్‌ టేకింగ్స్‌ కమిటీ ప్రభుత్వ కార్యకలాపాలు, ఖర్చులపై ‘శాశ్వత నిఘా’ని ఏర్పరుస్తాయని పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో జవాబుదారీతనం, పారదర్శకత, సుపరిపాలనను నిర్ధారించడం ద్వారా వ్యర్థమైన వ్యయాలను తనిఖీ చేయడానికి పిఎసి దోహదం చేస్తుందని తెలిపారు.

దేశ నిర్మాణంలో ప్రజాస్వామ్య సంస్థల పాత్ర కీలకమైనదని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి, వారి అంచనాలను నెరవేర్చడానికి సమర్థవంతమైన వేదికలుగా పిఎసి లాంటి సంస్థలు వ్యవహరిస్తాయని చెప్పారు. పార్లమెంటు పిఎసి, రాష్ట్రాల పిఎసిల మధ్య ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నందున ఒక ఉమ్మడి కమిటీ ఉంటే బావుంటుందని సూచించారు.

పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ చైర్‌పర్సన్‌ అధీర్‌ రంజన్‌ చౌదరి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా దేశానికి సేవ చేయాలనే భావంతో కమిటీ పనిచేస్తుందని తెలిపారు. వందేళ్ల ఉనికిలో కమిటీ అనేక రంగాలలో కొత్త పుంతలు తొక్కిందని, దాని పరిశీలన పరిధిని విస్తరించిందని తెలిపారు.