ధాన్యం కొనుగోలు ఎందుకు రాజకీయం చేస్తున్నా? 

అన్ని రకాలుగా తెలంగాణకు సహాయం అందిస్తున్నా  ధాన్యం కొనుగోలు విషయాన్ని రాజకీయంగా ఎందుకు లేవనెత్తుతున్నారు? అంటూ టీఆర్ఎస్ సభ్యులను రాజ్యసభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నిలదీశారు. ఎంవోయూ ప్రకారమే కొనుగోళ్లు జరుగుతున్నా ఎందుకు రాజకీయం చేస్తున్నారో అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. 

పైగా, పదే పదే ఎందుకు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారో అర్ధం కావడం లేదని గోయల్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం సేకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ప్రణాళిక ఉందా అని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే. కేశవరావు ప్రశ్నించగా మంత్రి తీవ్రంగా స్పందించారు. రైతు ప్రయోజనల పట్ల చాలా బాధ్యత కలిగిన ప్రభుత్వం తమదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో 51.9 నుంచి 74.54కు ఆ తర్వాత 94.54 లక్షల మెట్రిక్ టన్నులకు సేకరణ మొత్తాన్ని పెంచామని తెలిపారు. పైగా, కనీస మద్ధతు ధరను కూడా పెంఛామని చెప్పారు. దాంతో పాటుగా ధాన్యం సేకరణ పరిమాణం కూడా పెంచామని పేర్కొన్నారు. 2020-2021 ఖరీఫ్ సీజన్ లో కేంద్రంకు రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల టన్నుల అంచనాలు  పంపి,  32.66 లక్షల టన్నుల మాత్రమే ఇచ్చారుని గోయల్ గుర్తు చేశారు. 

అదేవిధంగా రబీ సీజన్ లో 55 లక్షల మెట్రిక్ టన్నుల ప్రతిపాదనలు చెప్పారు. కానీ 61.87 లక్షల టన్నులు మాత్రమే పంపారు. మొత్తంగా 94.53 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామని గోయల్ వివరించారు. కేంద్రం అధికారులు ధాన్యం నిల్వలను భౌతికంగా  పరిశీలించారని, సరైన పద్ధతిలో నిల్వ ఉంచలేదని,, అవకతవకలు కనిపించాయని ఆయన వివరించారు. 

94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు కట్టుబడి ఉండాలని మంత్రిని కేశవరావు కోరుతూ తెలంగాణాలో గతంతో పోల్చితే 60 శాతం దిగుబడి పెరిగిందని, రబీలో బాయిల్డ్ రైస్ ఎంత తీుసుకుంటారో చెప్పండని కోరారు. వెంటనే స్పందించిన పీయూష్ గోయల్మొ దట ఇచ్చిన టార్గెట్ ను పూర్తి చేయండని హితవు చెప్పారు. సమస్య వస్తే ఆ  తర్వాత చర్చిద్దామని సూచించారు. 

‘ఎంవోయూ ప్రకారం ధాన్యం సరఫరా చేయండి. ఎంవోయూ ప్రకారం మొదట రైస్ కొనండి. రాష్ట్రాల అవసరాల అనంతరం ధాన్యం తరలింపుపై ఎఫ్ సీ ఐ నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత సెంట్రల్ పూల్ కు పంపడం జరుగుతుంది. ప్రస్తుతం ఎంత అవసరం ఉందో రాష్ట్రాలు అంత ధాన్యం తీసుకోవాలి’ అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 

‘మా దగ్గర అవసరాలకు మించి ధాన్యం ఉంది.. అయినా మేం కొనం అంటున్నారు. మీ దగ్గర అవసరాలకు సరిపడా పారాబాయిల్డ్ రైస్ ఉందా? రబీ సీజన్ లో వరి ధాన్యం సాగు ప్రారంభమైంది. రబీ సీజన్ లో వరిధాన్యం కొనుగోలు చేస్తారా? లేదా? అని మరో టీఆర్ఎస్ సురేష్ రెడ్డి ప్రశ్నించారు.

‘గతేడాది 61.92 లక్షల టన్నులని చెప్పారు, కానీ 42.99 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారు. తెలంగాణతో పాటు దేశంలోని రాష్ట్రాలన్నీ కర్ణాటక విధానాన్ని అవలంబించాలి. వారు ఖచ్చితమైన వివరాలు ఇస్తున్నారు’ అని కేంద్ర మంత్రి హితవు చెప్పారు. 

ప్రస్తుతం తెలంగాణకు 29 లక్షల మెట్రిక్ టన్నుల టార్గెట్ ఇచ్చామని చెబుతూ పదే పదే సేకరణను పొడిగించాలని కోరుతుండడంతో ఇప్పటికే అయిదుసార్లు పొడగించామని గోయల్ గుర్తు చేశారు. “మొదట 24.75 పారాబాయిల్డ్ టార్గెట్ ఇచ్చాం. ఆ తర్వాత ఒక్కసారిగా 44 లక్షల టన్నులకు పెంచాం. కానీ 27.78 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారు. ఇప్పటికి 17లక్షల టన్నుల రైస్ ఇంకా సరఫరా చేయలేదు” అని వివరించారు. 

ఒప్పకున్నది సరఫరా చేయకుండా భవిష్యత్ గురించి అడుగుతున్నారని అంటూ తెలంగాణ ప్రభుత్వ ధోరణిని కేంద్ర మంత్రి ఎండగట్టారు. యూనిఫాం పాలసీ కోసం ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. “రాష్ట్ర అవసరాల మేరకు ధాన్యం కొనుగోలు జరుగుతుంది. వీళ్లేమో సేకరణ గురించి మాట్లాడుతున్నారు. పారాబాయిల్డ్ రైస్ ఎఫ్ సీ ఐకి సరఫరా చేయమని ఒప్పుకున్నారు. మొదట 17లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సరఫరా చేయండి. కొంత ధాన్యం మిగిలి ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు, దాన్ని సర్దుబాటు చేస్తామని చెప్పాం”  అని గోయల్ వివరించారు.