ఎన్నికల తర్వాతే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా

జమ్మూకశ్మీర్‌కు ఎన్నికల తర్వాతే రాష్ట్ర హోదా కల్పిస్తామని  కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్‌షా స్పష్టం చేశారు. ఢిల్లీలో  ‘హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌’లో ఆయన పాల్గొంటూ  రాష్ట్ర హోదాపై మాట్లాడుతున్న వారు కేవలం రాజకీయ వివాదం సృష్టించేందుకే ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. 

తొలుత రాష్ట్ర హోదా పునరుద్ధరించి, ఆ తర్వాతే ఎన్నికలు జరపాలనే రాజకీయ డిమాండ్ ఉందని, నియోజకవర్గాల పునర్విభజన చట్టాన్ని పార్లమెంటు ఆమోదించినందున తొలుత నియోజకవర్గాల విభజన జరిపి, ఎన్నికలు జరగాల్సి ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాతే రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రక్రియ ఉంటుందని తేల్చి చెప్పారు. 

ఇదే విషయం తాను చాలాసార్లు చెప్పానని, అయితే కొందరు దీనిని రాజకీయ వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని అమిత్ షా విమర్శించారు. ఆర్టికల్ 370 ని తిరిగి ప్రవేశపెట్టే వరకు అక్కడ శాంతి నెలకొన్నదని ఫారూఖ్ అబ్దుల్లా ఇటీవల చేసిన ప్రకటనను ఆయన కొట్టిపారవేసారు. ఆర్టికల్ 370 అంతకు ముందు 75 ఏళ్లుగా ఉంటున్నప్పటికీ 1990ల నుండి ఎందుకు అక్కడ  శాంతికి భంగం కలుగుతున్నదని ఆయన ప్రశ్నించారు. 

లెఫ్టనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నేతృత్వంలో అక్కడ అభివృద్ధి కార్యక్రమాల అమలు బాగా జరుగుతున్నదని, శాంతి భద్రతల పరిస్థితి మెరుగవుతున్నదని చెబుతూ అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని కేంద్ర హోమ్ మంత్రి. కోరారు. అభివృద్ధి కార్యక్రమాల అమలులో దేశంలో ప్రాధాన్యత గల ఐదు ప్రాంతాలలో జమ్మూ, కాశ్మీర్ ఒకటని చెప్పారు. 

కాగా, కెప్టెన్ అమరీందర్ సింగ్, అకాలీదళ్ మాజీ నేత సుఖ్‌దేవ్ సింగ్ థిండ్సా పార్టీలతో పొత్తు పెట్టుకుని పంజాబ్ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసే అవకాశం ఉందని అమిత్‌షా తెలిపారు. కెప్టెన్, థిండ్సాలతో మాట్లాడతామని, కుదిరితే పొత్తు ఉంటుందని చెప్పారు. రైతుల నిరసనల విషయంలో ప్రధాని పెద్ద మనసు చూపించి, సాగు చట్టాలతో ప్రయోజనం లేదని రైతులు భావిస్తే వాటిని వెనక్కి తీసుకుంటామని చెప్పారని గుర్తు చేశారు. 

 ఇక పంజాబ్ విషయంలో ఎలాంటి సమస్యలు లేవనే తాను అనుకుంటున్నానని చెప్పారు. యోగ్యతల (మెరిట్) ఆధారంగా పంజాబ్ ఎన్నికలు ఉంటాయని ఆయన నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేశారు. 

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో తిరిగి  గెలుస్తుందని, విపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడినప్పటికీ ఎలాంటి ప్రభావం ఉండదని అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. కూటముల ఆధారంగా ఓట్లు అంచనా వేయకూడదని, రాజకీయాలంటే ఫిజిక్స్ కాదని, కెమిస్ట్రీ అని పేర్కొన్నారు. 

ఒకసారి కాంగ్రెస్, సమాజ్‌వాదీ కలిసి పోటీ చేశాయని, ఆ తర్వాత మూడు పార్టీలు కలిసి పోటీకి దిగాయని, ఆ రెండు పర్యాయాలు బీజేపీనే గెలిచిందని గుర్తు చేశారు.  రైతుల నిరసన ప్రభావంపై మాట్లాడుతూ, ఇంతకుముందు కూడా రైతు నిరసనల ప్రభావం యూపీలో తక్కువగానే ఉందని, ఇప్పుడైతే అసలు కారణం అంటూ ఏమీ లేదని చెప్పారు.  

కరోనా  వేరియంట్ ఒమైక్రాన్‌ పరిణామాలను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని అమిత్‌షా తెలిపారు. ప్రస్తుతానికైతే ఎలాంటి నిర్దిష్ట అభిప్రాయానికి రాలేదని, ఏదైనా ఉంటే అది ప్రజల మందుంచుతామని చెప్పారు. ప్రజల్లో అవేర్‌నెస్ ముఖ్యమని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి, రెండో డోస్ తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని సూచించారు. అయితే, అనవసర వివాదానికి తావీయరాదనే ఉద్దేశంతోనే వ్యాక్సినేషన్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేయడం లేదని చెప్పారు.