ఉద్యమకారులు బీజేపీలోకి రావాలి 

ఉద్యమకారులు బీజేపీలోకి రావాలని ఉద్యమనేత, టీఎస్ పీఎస్సీ మాజీ సభ్యుడు విఠల్ పిలుపిచ్చారు. ఆత్మగౌరవం‌ సంగతి అటుంచితే..  టీఆర్ఎస్‌లో ఉద్యమకారులను పలకరించే నాథుడే లేడని పేర్కొంటూ పదవులు ఉద్యమకారులు హక్కు అని స్పష్టం చేశారు.
మరోవంక, ఈ నెల 9న విఠల్ పలువురు సహచరులతో కలిసి బీజేపీలో చేరనున్నట్లు చెబుతున్నారు. ఢిల్లీలో బిజెపి కేంద్ర పార్టీ కార్యాలయంలో ఆయన చేరనున్నట్లు తెలుస్తున్నది. ఆయనతో పాటు తీన్మార్ మల్లన్న, రాణి రుద్రమ తదితరులు కూడా చేరే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.
 
ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వటంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని విఠల్ విమర్శించారు. ఖాళీగా ఉన్న 40వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.  ఉద్యోగాల భర్తీపై మాట్లాడాలని అడిగితే ముఖ్యమంత్రి సమయం ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు.సీఎం కేసీఆర్ నుంచి పిలుపు కోసం ఏడాది కాలంగా ఎదురుచూశానని చెప్పారు. 
 
తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ తన స్థాయిని తానే తగ్గించుకున్నాడని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చి‌న మాట వాస్తవమని తెలిపారు. అయితే ప్రతిపక్ష పాత్రలో కాంగ్రెస్ విఫలమైందని ఆయన చెప్పారు. బీజేపీ వైపు తెలంగాణ ప్రజలు చూస్తున్నారని చెబుతూ,  బీజేపీలో మాత్రమే ఆత్మగౌరవం దక్కుతోందని తాను నమ్ముతున్నానని ఆయన తెలిపారు. జాతీయ పార్టీలో నాయకత్వం ఇచ్చే పనిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తానని ఆయన చెప్పారు. 
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న విఠల్ ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో తన వంత పాత్ర పోషించారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ ఆయనను  టీఎస్‌పీఎస్సీ సభ్యుడిగా నియమించారు. అయితే ఆ పదవీ కాలం ముగిసిన తర్వాత విఠల్‌‌ను ఖాళీగానే ఉంటున్నారు. ఆయనకు ఏదైనా కార్పొరేషన్ పదవి దక్కవచ్చనే ప్రచారం సాగినప్పటికీ అది కుదరలేదు.
విఠల్ చాలా రోజులుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు డిజైన్‌ను మార్చడాన్నిఆయన తప్పుబట్టారు. అంతేకాకుండా ఉద్యోగాల నోటిఫికేషన్ల విడుదల, నియమాకాల పట్ల ఆయన ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్‌ అధిష్టానానికి, విఠల్‌కు దూరం పెరిగినట్టుగా చెబుతున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాల నేతగా ఉన్న స్వామిగౌడ్.. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నమ్మిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. దీంతో ఆయనను ఎమ్మెల్సీగా చేసిన కేసీఆర్.. మండలి చైర్మన్‌ను కూడా చేశారు. అయితే ఆ పదవీకాలం ముగిసి తర్వాత ఆయన టీఆర్‌ఎస్‌పై అసంతృప్తి పెంచుకున్నారు. ఈ క్రమంలోనే గతేడాది నవంబర్‌లో ఆయన బీజేపీలో చేరారు.