క్రిప్టో నిబంధనలు ఉల్లంఘిస్తే రూ 20 కోట్ల జరిమానా!

దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో ఒడిదొడుకుల‌కు కార‌ణ‌మ‌వుతాయ‌ని భావిస్తున్న ప్రైవేట్ క్రిప్టో క‌రెన్సీ లావాదేవీలను కట్టడి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం భారీ కసరత్తు చేస్తున్నది. కేంద్రం త్వ‌ర‌లో తేనున్న చ‌ట్టంలో క‌ఠిన నిబంధ‌న‌లు చేర్చ‌నున్న‌ది. నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారికి 18 నెల‌ల వ‌ర‌కూ జైలు, రూ.5 నుండి 20 కోట్ల వ‌ర‌కూ జ‌రిమానా విధించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. 
 
క్రిప్టో క‌రెన్సీల‌ను చ‌ట్ట విరుద్ధ కార్య‌క‌లాపాల‌కు, ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌కు వినియోగించ‌కుండా నిరోధించేందుకు సంబంధిత చ‌ట్టాల్లో స‌వ‌ర‌ణ‌లు తీసుకొస్తార‌ని తెలుస్తున్న‌ది. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల్లో అల‌జ‌డి సృష్టిస్తున్న క్రిప్టో క‌రెన్సీల మాయ‌కు చెక్ పెట్టేందుకు కేంద్రం సిద్ధ‌మైంది.
వాటి ఆట క‌ట్టించ‌డానికి రూపొందించిన బిల్లుపై స‌ర్క్యులేట్ చేసిన క్యాబినెట్ నోటు మాత్రం క్రిప్టోల‌పై పూర్తి నిషేధం విధించబోవ‌డం లేద‌ని చెబుతున్న‌ది. బిట్ కాయిన్‌, ఎథీరియం, డోజ్ కాయిన్ వంటి క్రిప్టో క‌రెన్సీల‌ను దేశంలో చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన క‌రెన్సీగా ప‌రిగ‌ణించ‌బోమ‌ని క్యాబినెట్ నోట్‌లో పేర్కొన్న‌ట్లు తెలియ‌వ‌చ్చింది. క్రిప్టో క‌రెన్సీని క్రిప్టో అసెట్‌గా ప‌రిగ‌ణిస్తామ‌ని ఆ నోట్‌లో వ్యాఖ్యానించిన‌ట్లు స‌మాచారం.
దేశీయ స్టాక్ మార్కెట్ల‌ను నియంత్రిస్తున్న సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) ప‌రిధిలోకి దేశంలో ఇప్పుడు లావాదేవీలు నిర్వ‌హిస్తున్న క్రిప్టో ఎక్స్చేంజ్ ప్లాట్‌ఫామ్‌ల‌ను తీసుకు రావాల‌ని కేంద్రం త‌ల‌పోస్తున్న‌ది. క్రిప్టో ఎక్స్చేంజ్ ప్లాట్‌ఫామ్‌ల్లో క్రిప్టో అసెట్స్ లావాదేవీల‌ను సెబీ ప‌ర్య‌వేక్షిస్తున్న‌ది.

క్రిప్టో క‌రెన్సీలు క‌లిగి ఉన్న‌వారు వాటిని త‌మ క్రిప్టో క‌రెన్సీ అసెట్స్‌గా ప్ర‌క‌టించ‌డానికి క‌టాఫ్ డేట్‌ను ఖ‌రారు చేస్తారు. ఆర్బీఐ ప్ర‌తిపాదిస్తున్న వ‌ర్చువ‌ల్ క‌రెన్సీని న్యూ క్రిప్టో బిల్లు ప‌రిధిలోకి తేవ‌డం లేద‌ని తెలుస్తోంది. క్రిప్టో క‌రెన్సీ నియంత్ర‌ణ అంశాల‌ను ఆర్బీఐ కూడా ప‌ర్య‌వేక్షిస్తుంది.

మరోవంక, ఈ క్రిప్టో అసెట్స్‌ను ఉగ్ర‌వాద కార్య‌కలాపాల‌కు వాడ‌కుండా నిరోధించ‌డానికి ప్రివెన్ష‌న్ ఆఫ్ మ‌నీ లాండ‌రింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ)లో కేంద్రం అవ‌స‌ర‌మైన స‌వ‌ర‌ణ‌లు తీసుకు రానున్న‌ది. ఇక తాము చ‌లామ‌ణిలోకి తేనున్న డిజిట‌ల్ క‌రెన్సీకి బ్యాంక్ నోట్ అని నిర్వ‌చ‌నం ఇవ్వాల‌ని ఆర్బీఐ నుంచి ప్ర‌తిపాద‌న వ‌చ్చింద‌ని కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి.