
దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామాలో బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో జైషే ముహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఓ విదేశీ ఉగ్రవాదితో పాటు బాంబు పేలుళ్ల నిపుణుడు యాసిర్ పర్రే హతమయ్యారు. పర్రే స్వగ్రామమైన కసబ్యార్లో మంగళవారం రాత్రి 11 గంటలకు భారత సైనికులు చేపట్టిన ఆపరేషన్‌లో అతడు హతమయ్యాడు.
దానికంటే ముందు అతడి ఆచూకీ గురించి సైనికులకు సమాచారం అందింది. ఎన్కౌంటర్ ఆపరేషన్‌కు 44 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన కల్నల్ ఎకె సింగ్ నేతృత్వం వహించారు. యాసిర్ పర్రే ఎ క్యాటగిరి ఉగ్రవాది. అతడిపై క్యాష్ రివార్డు కూడా ఉంది.
2019 జూన్‌లో 44 రాష్ట్రీయ రైఫిల్స్ మల్టీ వెహికిల్ గస్తీ బృందాన్ని ఐఇడితో పేల్చేసిన ఘటనతో అతడికి సంబంధం ఉంది. ఆ ఘటనలో ఇద్దరు సైనికులు మృతి చెందగా, 17 మంది గాయపడ్డారు.
ఎన్కౌంటర్ ముగిశాక కల్నల్ ఎకె సింగ్ విలేకరుల ముందు భావోద్వేగంతో మాట్లాడుతూ “మీరు(ఉగ్రవాదులు) ఎక్కడైనా దాక్కొండి, మేము పట్టుకుంటాము, వెంటాడుతాము… ఎందుకంటే మేము ఎప్పటికి మరచిపోము, క్షమించబోము” అంటూ హెచ్చరించారు.
ఇదిలా ఉండగా కల్నల్ సింగ్ బుధవారం యాసిర్ పర్రే తండ్రిని పిలిచి ‘అతడిని లొంగిపొమ్మని చెప్పండి’ అని హితబోధ చేశారు. కానీ ఫుర్కాన్ అనే ఓ విదేశీ ఉగ్రవాది పెద్ద ఎత్తున కాల్పులకు పాల్పడడంతో యాసిర్ పర్రే లొంగిపోలేదు. దక్షిణ కశ్మీర్లో విదేశీ ఉగ్రవాదులకు యాసిర్ పర్రే గైడ్‌లా పనిచేస్తుంటాడు. అతడు 2018లో జైషే ముహమ్మద్ ఉగ్రవాద సంస్థలో చేరాడని సమాచారం.
More Stories
నమీబియా చీతా సాశ అనారోగ్యంతో మృతి
పుదుచ్చేరి బీజేపీ నేతను నరికి చంపిన దుండగులు
10 వేల మార్క్‌ను దాటిన యాక్టివ్ కరోనా కేసులు