తెలంగాణాలో బ్రిటన్ నుండి వచ్చిన మహిళకు ఒమైక్రాన్!

తెలంగాణలో బ్రిటన్‌ నుంచి వచ్చిన ఓ మహిళకు ఒమైక్రాన్ పాజిటివ్‌ వచ్చినట్లు తెలంగాణ ఆరోగ్యశాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమె నుంచి శాంపిల్స్‌ సేకరించిన అధికారులు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపారు. అలాగే ఆ మహిళను టిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. బుధవారం విదేశాల నుంచి వచ్చిన 320 మందికి అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించగా ఆమె విషయం బైటపడింది. 
 
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఒమైక్రాన్ ఎప్పుడైనా దేశంలోకి రావచ్చునని హెచ్చరించారు. నిన్న బ్రిటన్‌ నుంచి వచ్చిన ఓ మహిళకు పాజిటివ్‌ వచ్చిందని,  ఆమెను టిమ్స్‌లో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఒమైక్రాన్ వేరియంట్‌ 25 దేశాలకు వ్యాపించిందని పేర్కొంటూ టీకాల వల్లే ఆస్పత్రుల్లో చేరే ముప్పు తప్పించుకోవచ్చునని సూచించారు. 
 
వ్యాక్సిన్‌ ద్వారా ప్రాణాపాయం జరగకుండా కాపాడుకోవచ్చునని పేర్కొన్నారు. డెల్టా కంటే ఒమైక్రాన్ ఆరు రెట్లు వేగంగా విస్తరిస్తోందని చెబుతూ టీకా తప్పనిసరి చేయాలన్న ప్రతిపాదన ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు. కొవిడ్‌ నిబంధన ప్రతిఒక్కరూ పాటించాల్సిందేనని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
 
ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేకుండా జనాలు తిరిగితే వారికి రూ. 1000 జరిమానా విధిస్తామని డీహెచ్ హెచ్చరించారు. ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని పోలీస్‌ శాఖకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. మరోవైపు.. వాక్సిన్ తీసుకోకపోతే ఆత్మహత్య చేసుకున్నట్లేనని, రాష్ట్ర ప్రజలందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన సూచించారు. 
 
డిసెంబర్ చివరికల్లా రాష్ట్రంలో వాక్సినేషన్ పూర్తి చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రజలు కూడా తమ వంతుగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.
 
కాగా.. మళ్లీ ఆంక్షలు విధించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. ట్యాంక్‌బండ్, చార్మినార్ దగ్గర సండే- ఫన్ డే నిలిపివేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. మాల్స్, పబ్‌లు, మార్కెట్లలో కరోనా ఆంక్షలను కఠినతరం చేయాలని ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలొచ్చాయి. అంతేకాదు.. స్కూల్స్, కాలేజీల్లో పరిస్థితులపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది.