జగన్‌ సర్కారుపై పోరాటానికి ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధం

పీఆర్సీ, పెండింగ్ బకాయిల కోసం ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకుంటామని పదేపదే చెబుతూ వస్తున్న ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ పోరుబాట షెడ్యూల్ ను ఖరారు చేసింది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరిపినా ప్రయోజనం లేదని భావిస్తూ ఆందోళన చేయక తప్పడంలేదని ప్రకటించాయి. 

పీఆర్‌సీ, పెండింగ్‌ బకాయిలు, రిటైర్డ్‌ ఉద్యోగుల సమస్యలపై ఆదివారం విజయవాడలో విడిగా భేటీ అయిన ఏపీ అమరావతి జేఏసీ, ఏపీ ఎన్జీవో జేఏసీలు తమ డిమాండ్ల పరిష్కారానికి ఉద్యమిస్తున్నట్లు ప్రకటన చేశాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి డిసెంబర్ 1న ఉద్యోగ సంఘాలు నోటీసు ఇవ్వనున్నాయి. 

ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ ఐక్యకార్యచరణ వేదిక పలు ఉద్యమ తేదీలను ఖరారు చేసింది. డిసెంబర్‌ 1న ఏపీ సీఎస్‌కు నోటీసు, డిసెంబర్‌ 7నుంచి 10వ తేదీ వరకు అన్ని జిల్లాలో బ్లాక్‌ బ్యాడ్జీలతో ప్రదర్శన, 10న లంచ్‌ అవర్‌లో ప్రదర్శన, 13న నిరసన ర్యాలీ, అన్ని తాలూకాలు, డివిజన్లలో సమావేశాలు నిర్వహించాలని నాయకులు పిలుపునిచ్చారు.

డిసెంబర్ 13 నుంచి 15వ తేదీ వరకు తాలూకా కేంద్రాల్లో నిరసనలు తెలిపాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే డిసెంబర్ 16 నుంచి అన్ని తాలూకా కేంద్రాల్లో ధర్నాలకు పిలుపునిచ్చారు. డిసెంబర్ 21 నుంచి 26 వరకు జిల్లా ప్రధాన కేంద్రాల్లో ధర్నాలు, డిసెంబర్ 27న విశాఖ, 30న తిరుపతి, జనవరి 3న ఏలూరు, జనవరి 6న ఒంగోలులో ఉద్యోగ సంఘాల ప్రాంతీయ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా భారీ ఎత్తున ధర్నాలు నిర్వహిస్తున్నామని ఏపీజేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు . ప్రభుత్వం పీఆర్సీ నివేదికను బయటపెట్టకుండా ఉద్యోగులను అవమానిస్తోందని ఆయన మండిపడ్డారు.

ఉద్యోగులకు రూ.1,600 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని. పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా ప్రకటన చేస్తే ఏపీజేఏసీ, ఏపీజేఏసీ అమరావతి ఉమ్మడి వేదిక ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. కేంద్ర డీఏలతో కలిపి బకాయిపడ్డ డీఎలు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 94 ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయని ఆయన తెలిపారు. 

ఏపీలో కొంత కాలంగా పీఆర్సీతో పాటుగా పెండింగ్ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అక్టోబర్ నెలాఖరు నాటికే పీఆర్సీపై స్పష్టత ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.