దివాళా స్థితిలో పాక్ ప్రభుత్వం… ఇమ్రాన్ ఆందోళన

దేశాన్ని నడిపేందుకు నిధులు లేవని పేర్కొంటూ దివాళా పరిష్టితులో ఉన్నట్లు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పష్టమైన సంకేతం ఇచ్చారు. విదేశీ రుణాలు ఎక్కువ అయ్యాయని, ఇదే సమయంలో దేశంలో పన్నుల నుంచి వచ్చే ఆదాయం తగ్గిందని, ఇది దేశ భద్రతకు సమస్యగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

 దేశ రాజధాని ఇస్లామాబాద్‌లో చక్కెర పరిశ్రమ కోసం ఫెడరల్ బ్యూరో ఆఫ్ రెవెన్యూకి చెందిన ట్రాక్ సిస్టమ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇమ్రాన్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం వెచ్చించడానికి సరిపడా నిధులు లేవని తెలిపారు. 

‘‘మన దేశంలో (పాకిస్తాన్) అతిపెద్ద సమస్య ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడం. దేశాన్ని నడిపించడానికి, ప్రజా సంక్షేమంపై ఖర్చు చేసేందుకు నిధులు లేకపోవడం అతిపెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యను అధిగమించాలంటే విదేశాల నుంచి రుణాలు తీసుకోక తప్పదు’’ అని  ఆయన పేర్కొన్నారు. 

దేశంలో చాలా అవకాశాలు ఉన్నప్పటికీ సంక్షేమం కోసం కొద్ది మొత్తంలో వెచ్చించాల్సి వస్తోందని, పెరుగుతున్న విదేశీ రుణాలు, తగ్గిన పన్ను ఆదాయం కారణంగా జాతీయ భద్రతకు సమస్యగా మారుతోందని ఇమ్రాన్ తెలిపారు. స్థానికంగా ఆర్థిక మూలాలను పెంపొందించుకోవడంలో విఫలమయ్యామని ఆయన అంగీకరించారు. 

దేశాన్ని నడిపించడానికి తమ ప్రభుత్వం గత నాలుగు నెలల్లో విదేశాల నుంచి 3.8 బిలియన్ డాలర్ల రుణాలు తీసుకుందని తెలిపారు. అయితే దీనికి కారణం గత ప్రభుత్వాలని ఇమ్రాన్ విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వాల అవినీతి ఆర్థిక విధానాల వల్ల నేడు పాకిస్తాన్ నిధుల కొరత ఎదుర్కోవాల్సి వస్తోందని ఇమ్రాన్ దుయ్యబట్టారు.