క్రిప్టో కరెన్సీలు తప్పుడు చేతుల్లోకి వెళ్ళకుండా నిరోధించాలి

క్రిప్టో కరెన్సీలు అక్రమార్కులు, దుర్మార్గుల చెంతకు చేరకుండా ప్రపంచంలోని ప్రజాస్వామిక దేశాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. డిజిట‌ల్ క‌రెన్సీపై భారత్ ఇంకా ఎటువంటి నిర్ణ‌యాన్ని తీసుకోలేదని, కానీ క్రిప్టో వ‌ల్ల యువ‌త చెడిపోయే ప్ర‌మాదం ఉంద‌ని మోదీ హెచ్చరించారు. 
 
ద సిడ్నీ డ‌య‌లాగ్ స‌ద‌స్సులో పాల్గొన్న ఆయ‌న కీల‌కోప‌న్యాసం చేస్తూ  మ‌నీల్యాండ‌రింగ్‌కు, టెర్ర‌ర్ ఫైనాన్సింగ్‌కు క్రిప్టోమార్కెట్ల‌కు వేదిక‌గా మారుతున్న‌ట్లు   ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.టెక్నాల‌జీ, డేటాలు ఇప్పుడు కొత్త ఆయుధాలుగా మారుతున్నాయ‌ని, అందుకే డేటా గ‌వ‌ర్నెన్స్‌లో ప్ర‌జాస్వామ్య దేశాలు స‌హ‌క‌రించుకోవాల‌ని సూచించారు.
 
క్రిప్టోక‌రెన్సీ లేడా బిట్‌కాయిన్ గురించి ప్ర‌స్తావిస్తే, అన్ని ప్ర‌జాస్వామ్య దేశాలు ఈ అంశంపై క‌లిసి ప‌నిచేయాల‌ని, క్రిప్టోలు చెడ్డ‌వారి చేతుల్లోకి వెళ్ల‌కుండా చూడాల‌ని స్పష్టం చేశారు. ఎందుకుంటే అది మ‌న యువ‌త‌ను నాశ‌నం చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు మోదీ హెచ్చ‌రించారు. జాతీయ హక్కులను కూడా గుర్తిస్తూ, వ్యాపారం, పెట్టుబడులు, విశాల ప్రజా శ్రేయస్సులను ప్రోత్సహించాలని చెప్పారు. 
డిజిట‌ల్ యుగం మ‌నం చుట్టు ఉన్న అన్నింటినీ మార్చేస్తోంద‌ని, రాజ‌కీయాలు, ఆర్థిక వ్య‌వ‌స్థ‌, స‌మాజం అన్ని మారిపోయిన‌ట్లు మోదీ తెలిపారు. సౌభ్రాతృత్వం, ప‌రిపాల‌న‌, నీతి, చ‌ట్టాలు, హ‌క్కులు, భ‌ద్ర‌త అన్నింటిపై డిజిట‌ల్ ప్ర‌భావం ప‌డిన‌ట్లు ప్ర‌ధాని తెలిపారు. డిజిట‌లైజేష‌న్‌తో అంత‌ర్జాతీయ పోటీతత్వంలోనూ మార్పు వ‌చ్చింద‌ని పేర్కొన్నారు.