ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూషణ్‌కు క‌రోనా పాజిటివ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఈ నెల 15న నిర్వ‌హించిన ఆర్టీపీసీఆర్ టెస్టులో క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యులు తెలిపారు. 

బిశ్వ‌భూష‌ణ్ ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిని నిశితంగా ప‌రిశీలిస్తున్నామ‌ని చెప్పారు. 88 ఏళ్ల గవర్నర్‌ నవంబర్ 17న మధ్యాహ్నం 1 గంటకు గచ్చిబౌలిలోని ఏఐజీ  హాస్పిటల్స్‌లో అడ్మిట్ అయ్యారని వైద్యులు పేర్కొన్నారు.  గవర్నర్‌కు నవంబర్ 15న కోవిడ్‌ పాజిటివ్‌గా తేలిందని, ప్రస్తుతం ఆయనకు ఆక్సిజన్ అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. 

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆరోగ్యంపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. ఏఐజీ చైర్మన్‌, సీనియర్‌ వైద్యుడు డాక్టర్‌ డి.నాగేశ్వర్‌ రెడ్డితో సీఎం నేరుగా ఫోన్‌లో మాట్లాడారు. గవర్నర్‌ ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్యంపై వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. గవర్నర్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని ఈ సందర్భంగా డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి తెలిపారు.

బుధ‌వారం మ‌ధ్యాహ్నం తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్.. ఏఐజీ ఆస్ప‌త్రిలో బిశ్వ‌భూష‌ణ్‌ను ప‌రామ‌ర్శించారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిని వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నారు. విశ్వ భూష‌ణ్ బుధవారం ఉదయం తీవ్ర అనారోగ్యానికి గురవడంతో హుటాహుటిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు.