ఆర్బీఐ కొత్త స్కీమ్‌ల‌తో పెట్టుబ‌డులు విస్తృతం

వినియోగ‌దారుల కేంద్రీకృత‌మైన‌ రెండు ఆర్బీఐ స్కీమ్‌ల‌ను ఇవాళ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  ప్రారంభించారు. ఆర్బీఐ రిటేల్ డైరెక్ట్ స్కీమ్‌తో పాటు రిజ‌ర్వ్ బ్యాంక్‌-ఇంట‌గ్రేటెడ్ అంబుడ్స్‌మెన్ స్కీమ్‌ను ఆయ‌న ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా మోదీ మాట్లాడుతూ క‌స్ట‌మ‌ర్ కేంద్రీకృత‌మైన ఈ రెండు కొత్త స్కీమ్‌ల‌ వ‌ల్ల పెట్టుబ‌డుల రంగం విస్త‌రిస్తుంద‌ని  ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో మూల‌ధ‌న మార్కెట్ మ‌రింత సులువు అవుతుంద‌ని, ర‌క్ష‌ణాత్మ‌కంగా మారుతుంద‌ని పేర్కొన్నారు.

 ప్ర‌భుత్వ సెక్యూర్టీ మార్కెట్‌లో పెట్టుబ‌డి పెట్టేందుకు ఈ కొత్త స్కీమ్‌ల‌కు చిన్న ఇన్వెస్ట‌ర్ల‌కు డైరెక్ట్ యాక్సిస్ ఉంటుంద‌ని మోదీ తెలిపారు. స్థిర‌మైన ఆర్థిక వ్య‌వ‌స్థ కోసం బ‌ల‌మైన బ్యాకింగ్ వ్య‌వ‌స్థ అవ‌స‌ర‌మ‌ని ప్ర‌ధాని చెప్పారు. సుల‌భ‌త‌ర‌మైన పెట్టుబ‌డుల‌తో పాటు బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌పై సామాన్యుల న‌మ్మ‌కం చాలా కీల‌క‌మ‌ని పేర్కొన్నారు. 

ఒకే దేశం, ఒకే అంబుడ్స్‌‌మన్ వ్యవస్థ రూపుదిద్దుకున్నట్లు ప్రధాని వెల్లడించారు. ‘మరింత ప్రభావవంతంగా సేవలందించేందుకు ఆర్‌బీఐ టెక్నాలజీని విరివిగా వినియోగిస్తోంది. ఆర్‌బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్ ద్వారా చిన్న ఇన్వెస్టర్లు కూడా ప్రభుత్వ సెక్యూరిటీస్‌లో సురక్షిత మాధ్యమం ద్వారా పెట్టుబడులు పెట్టడం సాధ్యం అవుతుంది’ అని మోదీ చెప్పారు. 

‘ఈ దశాబ్దం దేశాభివృద్ధికి చాలా ముఖ్యమైనది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్‌బీఐ పాత్ర కూడా చాలా పెద్దది. అందుకు అనుగుణంగానే ఆర్‌బీఐ బృందం దేశం యొక్క అంచనాలను అందుకోగలదని నమ్మకం ఉంది’ అంటూ ప్రధాని ప్రశంసించారు. 

గ‌డిచిన ఏడేళ్ల‌లో ఎన్పీఏల‌ను చాలా పార‌ద‌ర్శ‌కంగా చూశామ‌ని, తీర్మానాలు.. రిక‌వ‌రీల‌పై దృష్టిపెట్టామ‌ని తెలుపుతూ ఈ సంస్క‌ర‌ణ‌ల‌తో బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ బ‌లోపేత‌మ‌వుతోంద‌ని భరోసా వ్యక్తం చేశారు. నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి సమయంలో ఆర్థిక మంత్రిత్వ శాఖతో రిజర్వ్ బ్యాంక్ పనిచేసిన విధానాన్ని అభినందించారు.కార్యక్రమంలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా పాల్గొన్నారు.