హిందూ ఆలయాన్ని పునః ప్రారంభించిన పాక్ చీఫ్‌జస్టిస్

వందేళ్ల చరిత్ర ఉన్న ఓ హిందూ ఆలయాన్ని పాకిస్థాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్ పునఃప్రారంభించారు. గతేడాది డిసెంబర్‌లో ఖైబర్‌పఖ్తూన్ రాష్ట్రంలోని శ్రీపరమ్‌హంసజీ మహరాజ్ ఆలయాన్ని ఇస్లామిక్ అతివాదులు ధ్వంసం చేశారు. 

ఈ ఘటనపై విచారణ చేపట్టిన గుల్జార్‌అహ్మద్ ఆలయాన్ని పునర్‌నిర్మించాలని ఆదేశించారు. ధ్వంసం చేసినవారి నుంచే నష్టపరిహారం రాబట్టాలని పాక్ ప్రభుత్వానికి సూచించారు. 1920లో తేరీ అనే గ్రామంలో నిర్మించిన ఈ ఆలయాన్ని జమైత్ ఉలేమాఇఇస్లామ్ ఫజీకి చెందిన అతివాదులు గతేడాది ధ్వంసం చేశారు.

పునర్ నిర్మాణమైన ఆలయాన్ని ప్రారంభించిన గుల్జార్ అక్కడి హిందువులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుప్రీం కోర్ట్ ఎప్పుడు దేశంలోని మైనారిటీల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు. భవిష్యత లో కూడా అదే విధంగా ఉండగలదని భరోసా ఇచ్చారు. పాకిస్థాన్ రాజ్యాంగాన్ని ప్రస్తావిస్తూ దేశంలో ఇతర మతస్తులకు ఉన్న హక్కులు అన్ని హిందువులకు కూడా ఉన్నాయని తెలిపారు. ప్రతివారు తమ పవిత్ర స్థలాలను గౌరవిస్తుంటారని పేర్కొంటూ వాటికి అపకారం చేసే హక్కు ఎవ్వరికీ లేదని తేల్చి చెప్పారు.

ఈ కార్యక్రమం పాకిస్థాన్ హిందూ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగింది. గుల్జార్‌కు కౌన్సిల్ అధ్యక్షుడు, అధికార తెహ్రీక్‌ఇఇన్సాఫ్ పార్టీ ఎంపి రమేశ్‌కుమార్‌వాంక్వానీ మాట్లాడుతూ ఈ దేవాలయం విషయంలో ప్రధాన న్యాయమూర్తి సకాలంలో స్పందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

పాకిస్థాన్ లోని మరో నాలుగు పురాతన దేవాలయాలను కూడా తిరిగి తెరిచినట్లయితే వేలాది మంది హిందువులు దర్శించుకొని అవకాశం కలుగుతుందని చెప్పారు. అంతేకాగా, అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట కూడా ఇనుమడిస్తుందని తెలిపారు. దేశంలో మైనారిటీల పట్ల నెలకొన్న ప్రతికూల భవనాలను తొలగించడం కోసం ఒక సదస్సు నిర్వహింపబోతున్నట్లు ఆయన వెల్లడించారు.

హిందూ కౌన్సిల్ ఈ సందర్భంగా గుల్జార్‌కు డిజిటల్ ఖురాన్, టోపీ బహూకరించింది. తమ దేశ రాజ్యాంగం ప్రకారం మిగతా మతాలకున్నట్టే హిందువులకూ సమాన హక్కులున్నాయని గుల్జార్ స్పష్టం చేశారు.

ఇస్లామాబాద్ ఆలయంకు తిరిగి స్థలం 

ఇలా ఉండగా, పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో హిందూ దేవాలయానికి మొదటి సారి కేటాయించిన స్థలాన్ని క్యాపిటల్ డెవలప్‌మెంట్ అథారిటీ (సిడిఎ) తీసేసుకుంది. కానీ దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసేసరికి తిరిగి ఆ స్థలాన్ని ఇచ్చేశారు. 

ఈ విషయంపై ఇస్లామాబాద్ హైకోర్టు తాజా విచారణ చేపట్టినట్లు ‘డాన్’ వార్తాపత్రిక ఇటీవల పేర్కొంది. కాగా కొన్ని కారణాల దృష్టా గుడి నిర్మాణాన్ని అడ్డుకున్నామని అంతేకానీ తాము ఏ వర్గానికి వ్యతిరేకం కాదని సిడిఎ కోర్టుకు తెలిపింది. ఇస్లామాబాద్‌లో 2016లో మొదటిసారి మందిరానికి అర్ధ ఎకరం స్థలాన్ని కేటాయించారు. 

ఇందులో మందిరంతో పాటు కమ్యూనిటీ సెంటర్, హిందూ స్మశానవాటిక నిర్మించాలని నిర్ణయించారు. కాగా 2021 ఫిబ్రవరిలో సిడిఎ అధికారులు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఇస్లామాబాద్‌లో నిరసనలు వ్యక్తం అయ్యాయి. నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. దాంతో సిడిఎ దిగిరాక తప్పలేదు.