అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రారంభం

అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని స్పష్టం చేస్తూ రైతులు, మహిళలు సోమవారం ఉదయం మహా పాదయాత్ర ప్రారంభమైనది. ఈ పాదయాత్ర తుళ్లూరు నుంచి తిరుమల వరకు మొత్తం 45 రోజులపాటు కొనసాగనుంది. రోజుకి 14 కిలో మీటర్లు ఈ పాదయాత్ర చేస్తారు. న్యాయస్థానం నుండి దేవస్థానం పేరిట ఈ పాదయాత్ర చేపట్టారు.
 
సోమవారం రాత్రికి తుళ్లూరు నుంచి పరిమి మీదుగా తాడికొండకు పాదయాత్ర చేరుకోనుంది. గుంటూరు జిల్లాలో 6 రోజులు ఈ పాదయాత్ర కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా జరిగే ఈ యాత్ర డిసెంబరు 17న తిరుపతిలో ముగియనుంది. 
 
వైసిపి మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా, రైతు సంఘాలు ఈ పాదయాత్రకు సంఘీభావం ప్రకటించాయి. ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని టిడిపి నేతలు తెలిపారు. ఈ పాదయాత్రలో పెద్ద ఎత్తున రైతులు, మహిళలు, వివిధ రాజకీయపక్షాల నేతలు పాల్గొన్నారు.
 
ఈ యాత్రకు అనుమతి ఇవ్వడానికి తొలుత పోలీసులు నిరాకరించారు. హైకోర్టు ఆదేశాలతో ఆ తరువాత అనుమతి ఇచ్చినప్పటికీ అనేక ఆంక్షలు విధించారు. దీంతో పాదయాత్ర జరిగే తీరుపై స్థానికంగా ఉత్కంఠ నెలకొంది. 45 రోజుల పాటు దాదాపు 450 కిలోమీటర్లు ఈ పాదయాత్ర కొనసాగనుంది.
 
అమరావతిని ప్రతిపక్షంలో ఉండగా బలపరిచిన జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల పేరుతో అభివృద్ధి పనులు నిలిపేయడం,  మూడు రాజధానులనే ఏర్పాటు చేస్తామని, అమరావతిని శాసన రాజధానిగా పరిమితం చేస్తామని ప్రకటించడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది.
ఒకే రాజధాని ఉండాలన్న నినాదంతో పాటు, రాజధాని కోసం భూములు త్యాగం చేసిన తమకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని కోరుతూ స్థానిక రైతులు, మహిళలు 18 నెలలుగా ఆందోళన చేస్తున్నారు.  ఇప్పటి వరకు అమరావతి పరిధిలోని 29 గ్రామాలకు పరిమితమైన  వీరి ఉద్యమం ఇప్పుడు ఈ పాదయాత్రతో రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు  విస్తరింపనుంది.