ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో పునీత్ అంత్య‌క్రియ‌లు పూర్తి

గుండెపోటుతో గత శుక్రవారం అకస్మాత్తుగా కన్నుమూసిన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్య‌క్రియ‌లు ప్రభుత్వ లాంఛనాలతో పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం బెంగళూరులోని కంఠీరవ మైదానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పునీత్‌ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పునీత్‌ సోదరుడు రాఘవేంద్ర కుమారుడు వినయ్‌తో అంత్యక్రియలు జరిపారు. 
 
ఉదయం 5 గంటల ప్రాంతంలో కంఠీరవ స్డేడియం నుంచి కంఠీరవ స్టూడియో వరకు భారీ కాన్వాయ్ మధ్య పునీత్ అంతిమయాత్ర నిర్వహించారు. వేలాది మంది అభిమానులు ‘పునీత్ అమర్‌రహే’ అంటూ నినాదాలు చేస్తూ అంతిమయాత్రలో పాల్గొన్నారు.
 
పునీత్ అంత్యక్రియలకు ఆయన కుటుంబ సభ్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, మాజీ ముఖ్యమంత్రులు బిఎస్ యడియూరప్ప, సిద్ధరామయ్య, తదితరులు పాల్గొన్నారు. పునీత్ అంత్యక్రియలను జనం చూసేందుకు వీలుగా కంఠీరవ స్టూడియో బయట, ఇతర ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు.
 
అంత్యక్రియలు నిర్వహించే ముందు ముఖ్యమంత్రి బొమ్మై పునీత్ ను కడసారిగా చూసుకుని కన్నీటి నివాళి అర్పించారు. అంతేకాకుండా పునీత్ పార్థీవదేహాన్ని ముద్దాడి, ప్రేమగా తలను నిమిరారు. గుండెలపై రెండు చేతులను పెట్టి కొద్దిసేపు నిల్చుండిపోయారు. మరోసారి పునీతుడి తలను నిమిరారు. చెంపలను తడిమారు.
 
చేతులు జోడించి పార్థివదేహానికి నమస్కరించారు. కన్నీరు పెట్టుకున్నారు. భార్య అశ్వినీ రేవంత్, కుమార్తెలు ధృతి రాజ్‌కుమార్, వందిత రాజ్‌కుమార్.. పార్థివదేహం వద్దే కొద్దిసేపు కూర్చున్నారు. కడసారి వీడ్కోలు పలికారు. పునీత్ అంటే బొమ్మైకి కూడా ఎంత అభిమాన‌మో ఈ సన్నివేశం చూస్తుంటే తెలుస్తుంది. పునీత్ ఇక లేడ‌నే విష‌యాన్ని ఎవ‌రు జీర్ణించుకోలేక‌పోతున్నారు.