పాక్ గెలుపును వేడుక చేసుకున్నందుకు రాజద్రోహం కేసులు!

పాక్ గెలుపును వేడుక చేసుకున్నందుకు రాజద్రోహం కేసులు!
టీ20 ప్రపంచకప్‌-2021లో భారత్‌పై పాకిస్థాన్ జట్టు గెలుపొందిన అనంతరం సంబురాలు చేసుకున్న వారిపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తీవ్రంగా స్పందించారు.  అలా చేసిన వారిపై దేశద్రోహం కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు.
 
సీఎం ఆదేశాలతో యూపీ పోలీసులు ఇప్పటికే ఆగ్రా, బరేలీ, బదావున్‌, సీతాపూర్‌ జిల్లాల్లో ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. 
వీరిలో నలుగురు పాక్‌ అనుకూల నినాదాలు చేశారని రుజువు కావడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై ఐపీసీ సెక్షన్‌ 504/506, ఐటీ చట్టంలోని 66(ఎఫ్‌) సహా ఇతర సెక్షన్లు కింద కేసులు నమోదు చేశారు.
 
పాకిస్థాన్ జట్టు గెలిచినందుకు వేడుక చేసుకున్నం జమ్మూకశ్మీర్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులను బుధవారం ఆగ్రాలో అరెస్టు చేశారు. అరెస్టయిన ఈ ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆగ్రాలోని రాజా బలవంత్ సింగ్ కాలేజ్‌లో చదువుకుంటున్నారు. 
 
వారిలో అర్షీద్ యూసుఫ్, ఇనాయత్ అల్తాఫ్ షేఖ్ మూడో సంవత్సరం కోర్సులో చదువుతుండగా, షౌకత్ అహ్మద్ గని నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. వారి మీద గ్రూపుల మధ్య మతపరంగా శత్రుత్వాన్ని పెంచుతున్నారు, సైబర్ టెర్రరిజంకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు బనాయించారు.
 
కాగా, టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్‌ 24న దుబాయ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియాపై పాక్‌ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో భారత్‌ తొలిసారి పాక్‌ చేతిలో ఓటమిని చవిచూడడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీమిండియా అభిమానులు నిరాశకు గురయ్యారు.
 
అయితే, భారత్‌లో ఉంటున్న కొందరు మాత్రం పాక్‌ విజయాన్ని వేడుక చేసుకున్నారు. బాణసంచా కాల్చుతూ.. పాక్‌ అనుకూల నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలోనే యూపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే, రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ జిల్లాకు చెందిన నఫీసా అనే ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్‌ పాక్‌ గెలుపును సెలబ్రేట్‌ చేసుకుంటూ వాట్సాప్‌లో స్టేటస్‌ పెట్టింది. ఇందుకు ఆమెను సస్పెండ్‌ చేయడంతో పాటు అక్కడి పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.