మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌పై ఫిర్యాదు

మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌పై నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో  జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాఖండే సోదరి, న్యాయవాది యాస్మిన్‌ వాంఖడే ముంబై పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు కాపీని జాతీయ మహిళా కమిషన్‌కు కూడా పంపారు. అయితే, గతవారం యాస్మిన్‌ వాంఖడే ఫిర్యాదు చేశారని ఓషివారా పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు.

సమీర్‌ వాంఖడే వ్యక్తిగత జీవితంపై నవాబ్‌ మాలిక్‌ ఆరోపణలు చేస్తున్నప్పటి నుంచి సమీర్‌ కుటుంబానికి బెదిరింపు కాల్స్‌ రావడం ప్రారంభించాయని, కుటుంబంలో భయానక వాతావరణం నెలకొందని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. అలాగే మహారాష్ట్ర మంత్రిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు.

అయితే, ఇప్పటి వరకు ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరో వైపు జాతీయ మహిళా కమిషన్‌ చైర్ పర్సన్ రేఖాశర్మ మాట్లాడుతూ  యాస్మిన్‌ తన సోదరుడి గురించి రాసినట్లు తెలిపారు. ఈ విషయంలో పోలీసులు ఉదాసీనత చూపారని పేర్కొన్నారు. ఈ విషయమై మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాస్తామని రేఖాశర్మ వెల్లడించాయిరు. యాస్మిన్‌, ఆమె సోదరుడు ఈ విషయంలో పోలీసులను ఆశ్రయించవచ్చని ఆమె సూచించారు. 

మరోవంక, సమీర్ వాంఖడేపై వచ్చిన దోపిడీ, అవినీతి ఆరోపణలకు సంబంధించి మూడు పనిదినాల ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయబోమని మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం బాంబే హైకోర్టుకు తెలిపింది. తనతో సహా ఎన్‌సీబీ అధికారులపై వచ్చిన ఆరోపణలపై ముంబై పోలీసుల దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ వాంఖడే బాంబే హైకోర్టును ఆశ్రయించారు. వాంఖడే అరెస్టు నుండి మధ్యంతర రక్షణ కోరారు.

దోపిడీ లేదా అవినీతికి సంబంధించి తనపై దాఖలు చేసిన లేదా ప్రతిపాదించిన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను మహారాష్ట్ర ప్రభుత్వం కాకుండా ఎన్‌ఐఎ లేదా సిబిఐ ద్వారా దర్యాప్తు చేయాలని అతను హైకోర్టును ఆదేశించాలని ఆయన కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వం తరపున వాదిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్, అరెస్టు చేయడానికి ముందు వాంఖడేకు మూడు పనిదినాల నోటీసు ఇస్తామని జస్టిస్ నితిన్ ఎం జమ్దార్, జస్టిస్ సారంగ్ వి కొత్వాల్‌లతో కూడిన డివిజన్ బెంచ్‌కి తెలిపారు. 

ఆయనపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్నదని మహారాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఒక వేళ సమీర్‌ వాంఖడేపై ఏదైనా కేసు నమోదై ఆయనను అరెస్టు చేయాల్సి వస్తే 72 గంటల ముందుగా నోటీసు ఇస్తామని తెలిపారు. దీంతో సమీర్‌ వాంఖడే పిటిషన్‌ను బాంబే హైకోర్టు గురువారం కొట్టివేసింది.
 “నాపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. నేను కేసును విచారిస్తున్న కేంద్ర ప్రభుత్వ అధికారి అయినప్పటికీ రాష్ట్రం తన పరిధిని మించిపోతోంది. నేను ఎన్‌సిబికి సహకరిస్తాను, కానీ ఇప్పుడు రాష్ట్రం సిట్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్రం నాపై వ్యక్తిగతంగా దాడి చేసింది. వారు నన్ను ఏ రోజునైనా అరెస్టు చేస్తారని నా భయం.  అందువల్ల, మధ్యంతర రక్షణ అవసరం’ అని వాఖండే కోర్ట్ కు తెలిపారు.