గాంధీజీ ఆదర్శాలు ధైర్యం, ప్రేరణ ఇస్తాయి 

గాంధీజీ ఆదర్శాలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ధైర్యం, ప్రేరణ ఇస్తాయని, ఆయనకు రోమ్‌లో నివాళులర్పించే అవకాశం తనకు లభించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతకుముందు ఆయన నగరంలోని పియాజా గాంధీ వద్ద గాంధీజీకి నివాళులర్పించారు. ఇటలీలోని భారత సంతతి ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని, మోదీకి ఘన స్వాగతం పలికారు. ఆ ప్రాంతమంతా ‘‘మోదీ, మోదీ…’’ నినాదాలతో మారుమోగింది. 

మోదీని సమీపం నుంచి చూడటానికి, ఆయనతో కరచాలనం చేయడానికి  భారత సంతతి ప్రజలు చాలా ఉత్సాహంతో ప్రయత్నించారు. నాగపూర్‌లో జన్మించిన హరి ఓం కాలియా ఇటలీలో 20 సంవత్సరాల నుంచి యోగా బోధిస్తున్నారు. ఆయన తన ముగ్గురు శిష్యులతోపాటు శివ స్థుతిని పఠించారు.

దీంతో మోదీ ముఖంలో చిరునవ్వు తొణికిసలాడింది. హరి ఓం కాలియా ప్రధాని మోదీతో మాట్లాడుతూ, తాను నాగపూర్‌లో జన్మించానని తెలిపారు. ఆయనతో మోదీ మరాఠీలో సంభాషించారు. మరో మహిళ గుజరాతీలో మోదీ క్షేమ సమాచారాన్ని అడిగినపుడు, ఆమెకు గుజరాతీలో సమాధానం చెప్పారు. అనంతరం మోదీ అక్కడికి వచ్చిన ఇతరులకు అభివాదం చేశారు. వారంతా ‘‘భారత్ మాతా కీ జై’’, ‘‘మోదీ… మోదీ…’’ అంటూ నినాదాలు చేశారు. 

16వ జీ-20 సదస్సు నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటలీ చేరుకున్నారు. ఆయన ఇటలీ రాజధాని రోమ్‌కు శుక్రవారం మధ్యాహ్నం చేరుకున్నారు. ఇటలీ ప్రధానమంత్రి మరియో డ్రగి మోదీకి స్వయంగా స్వాగతం పలికారు. ప్రధానమంత్రి మోదీ రోమ్‌లో మొదటి అధికారిక కార్యక్రమంగా యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ మిచెల్,  యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్‌లతో సమావేశమై వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలు, వాతావరణ మార్పులు, కరోనా వంటి అంశాలతో పాటు,  ప్రపంచ,  ప్రాంతీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించారు.

కాగా 30-31 రోజుల్లో జరిగే జీ-20 16వ సదస్సులో మోదీ పాల్గొననున్నారు. ఈ సదస్సు అనంతరం వాటికన్‌లోని పోప్ ఫ్రాన్సిస్‌ని మోదీ కలవనున్నారు. ప్రధాని మోదీ పాల్గొనబోతున్న ఎనిమిదవ జీ-20 సదస్సు ఇది. గత ఏడాది జీ-20 సదస్సు సౌది అరేబియాలో జరిగింది. అయితే అప్పుడు కొవిడ్ కారణంగా వర్చువల్ ద్వారా సమావేశం నిర్వహించారు. జీ-20 సదస్సుకు మోదీ చివరిసారిగా హాజరైంది 2019లో ఒసాకాలో జరిగిన సదస్సు. అనంతరం రెండేళ్లకు ఇటలీలో జరగబోతున్న సమావేశంలో పాల్గొననున్నారు.

ఇటలీ ప్రధాని మారియో డ్రాఘి ఆహ్వానం మేరకు అక్టోబర్ 29-31 తేదీల్లో రోమ్, వాటికన్ సిటీలను సందర్శిస్తానని, ఆ తర్వాత నవంబర్ 1-2 తేదీల మధ్య బ్రిటన్‌లోని గ్లాస్గోకు వెళతానని భారత్ నుండి విదేశీ పర్యటనకు బయలుదేరే ముందు ప్రధాని మోదీ తెలిపారు. బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆహ్వానం. జీ20 సదస్సు సందర్భంగా ఇతర భాగస్వామ్య దేశాల నేతలతో కూడా సమావేశమవుతామని, వారితో భారత్ ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షిస్తానని ప్రధాని చెప్పారు.