ఆదానికి 130 ఎకరాలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం 

ఆదానికి 130 ఎకరాలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం 

విశాఖ మధురవాడలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థకు 130 ఎకరాలు ఇచ్చేందుకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్  జగన్‌ మోహన్ రెడ్డి  అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గం శారదా పీఠానికి 15 ఎకరాలు ఇచ్చేందుకు కూడా ఆమోదించింది.

బీసీ జనగణన చేపట్టాలంటూ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపేందుకు ఆమోదం తెలిపింది. త్వరలో జనాభా లెక్కలు జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రకాశం జిల్లా వాడరేవు సహా 5 ఫిషింగ్‌ హార్బర్ల డీపీఆర్‌లకు, ఈడబ్ల్యూఎస్‌కు ప్రత్యేకశాఖ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది.

ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాలకు వీలుగా సినిమాటోగ్రఫీ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. రైతులకు 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్‌ అందించేందుకు సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో ఒప్పందానికి ఆమోదం తెలిపింది.

యూనిట్‌కు రూ.2.49 చొప్పున ఏడాదికి 17 వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో 5చోట్ల సెవన్‌ స్టార్‌ పర్యాటక రిసార్ట్‌ల ఏర్పాటు కోసం భూముల కేటాయింపునకు కూడా ఆమోదం తెలిపారు.

దేవాదాయశాఖ స్థలాలు, దుకాణాల లీజు అంశంపై చట్ట సవరణ, దేవాదాయ శాఖలో విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ వింగ్‌ ఏర్పాటు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ‘అమ్మఒడి’ పథకం అమలుపై కేబినెట్‌లో చర్చ జరిగింది. అమ్మఒడి పథకానికి 75 శాతం హాజరు ఉండాలన్న అంశంపై విస్తఅతంగా ప్రచారం చేసే అంశానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

అసెంబ్లీ సమావేశాలు నవంబర్‌ 17 నుండి జరపాలని నిర్ణయించారు. ఈ సమావేశాలు 6 రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. వైద్య విద్య, కుటుంబ సంక్షేమ శాఖలో కొత్త ఉద్యోగాల కల్పనకు మంత్రివర్గం ఆమోదించిందని మంత్రి పేర్ని నాని తెలిపారు.

కాగా, రాష్ట్రంలో 13 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని.. న్యాయస్థానం తీర్పు ఇస్తే.. 30 మున్సిపాలిటీలకు జరపాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. వీటితోపాటు ఖాళీగా ఉన్న జడ్పీటీసీ , ఎంపీటీసీ, సర్పంచ్‌ స్థానాల భర్తీకి కూడా నోటిఫికేషన్‌ జారీ చేయాలని పంచాయతీరాజ్‌, పురపాలక మంత్రులను ఆదేశించారు.

నవంబరు 1న నోటిఫికేషన్‌ జారీ చేస్తే.. ఎన్నికల ప్రక్రియ 15 రోజుల్లో అంటే.. నవంబరు 15 నాటికి పూర్తవుతుందని తెలిపారు. వెంటనే నవంబరు 16 లేదా 17వ తేదీ నుంచి అసెంబ్లీ  సమావేశాలు నిర్వహిద్దామని స్పష్టం చేశారు.