ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు పోలీసులు, ఓ సైనికునికి గాయం

జమ్ముకాశ్మీర్‌లో పూంచ్‌ జిల్లాలో ఆదివారం ఉదయం ఉగ్రవాదులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు పోలీసులు, ఓ సైనికుడు గాయపడ్డారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా శ్రీనగర్ లో భద్రతా వ్యవహారాలను సమీక్ష జరుపుతున్న సమయంలోనే ఉగ్రవాదులు కలియబడటం గమనార్హం.  పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌ నుండి పట్టుబడ్డ ఉగ్రవాది కూడా ఈ కాల్పుల్లో గాయపడ్డారు. 

గత 14 రోజులగా పూంచ్‌ జిల్లాలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌ను సైనిక దళాల చేపడుతున్నాయి. ఆదివారం కూడా ఆర్మీ, పోలీసులు ఉమ్మడిగా పూంచ్‌ జిల్లాలోని అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతుండగా.. ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారని అధికారులు చెప్పారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భాటా దురియా ప్రాంతంలో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలను అన్వేషించేందుకు కొన్నేళ్లుగా కోట్‌ బల్వాల్‌ జైలులో ఉన్న జియాను వెంట తీసుకుని వెళ్లారు. స్థావరాలకు సమీపంగా చేరుకోగానే అక్కడే పొంచి ఉన్న ఉగ్రవాదులు కాల్పులు జరిపారని చెప్పారు. 

కాగా, ఉగ్రవాద ఏరివేత చర్యల్లో భాగంగా గత రెండు వారాల నుండి సైన్యం నిమగమైంది. ఇప్పటి వరకు ఈ ఆపరేషన్‌లో ఇద్దరు అధికారులతో పాటు తొమ్మిది మంది సైనికులను పొగొట్టుకుంది. అక్టోబర్‌ 11న ఉగ్రవాదులతో తొలిసారిగా ఎన్‌కౌంటర్‌ మొదలైంది.

సోఫియాన్‌ జిల్లాలో బాబపొరాలోని జైన్‌పొరా ప్రాంతంలో సెంట్రల్‌ రిజర్వు పోలీస్‌ ఫోర్స్‌ (సిఆర్‌పిఎఫ్‌), ఉగ్రవాదులకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక పౌరుడు బలయ్యాడు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఉగ్రవాదులు 178 బెటాలిరు నాకా పార్టీపై దాడి చేశారని, దీంతో అప్రమత్తమైన సిఆర్‌పిఎఫ్‌ దళాలు ఎదురుదాడికి దిగాయని, ఈ ఎన్‌కౌంటర్‌లో షాహిద్‌ అహ్మద్‌ అనే పౌరుడు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.