కేటీఆర్ చేతగానివాడు కావడం వల్లే హుజురాబాద్ ఉప ఎన్నిక 

కేటీఆర్ చేతగానివాడు కావడం వల్లే హుజురాబాద్ ఉప ఎన్నిక 

కేటీఆర్ చేతగానివాడు కావడం వల్లే హుజురాబాద్ ఉప ఎన్నిక వచ్చిందని బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ ధ్వజమెత్తారు. కొడుకు కోసం ఈటలను కేసీఆర్ బయటకు పంపాడని ఆరోపించారు.   రాజేం‎దర్‎ను ఇబ్బంది పెట్టే బదులు కొడుకుకు బుద్ధి చెబితే బాగుంటుందని కేసీఆర్ కు అర్వింద్ హితవు చెప్పారు.

కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో ఈటలతో కలిసి  ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ `అప్పట్లో కేటీఆర్‎ను ముఖ్యమంత్రిని చేయాలనుకున్నప్పుడు మేమందరం ఈటలను చేయాలన్నాం. ఆనాటి నుంచి కేసీఆర్‎కు నిద్రపట్టలేదు’ అని వెల్లడించారు. “టీఆర్ఎస్ పునాదుల దగ్గర నుంచి ఈటల ఉన్నాడు. ఆ పార్టీలో బలమైన భాగం ఈటల. కొడుకు కోసం ఈటలను బయటకు పంపాడు.  తీన్మార్ మల్లన్న మీద కేసు పెట్టినట్లు కేసీఆర్ నామీద కూడా పెడతాడు కావచ్చు” అని తెలిపారు.

ప్రతిసారి దుబాయ్‎కు పోవుడు వచ్చుడేనా…  అని కేటీఆర్‎ను కేసీఆర్ తిట్టాడు. ఆ ముసలాయనకి సోయి ఎప్పుడు వస్తుందో ఏమో.. ఈటలతో గెలుక్కున్నకాన్నుంచి ఆయనకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. మితిమీరిన అహంకారం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడినది చెప్పారు. పేదప్రజల రక్తమాంసాలు తిని సంపాదించిన అహంకారం కేసీఆర్‎ది. ఓటమి ఎరుగని ఈటల ఎదుగుతున్నాడని జీర్ణించుకోలేక బయటకు పంపాడు. కేసీఆర్‎‎ను మించిన అవినీతి గబ్బిలాలు కేటీఆర్, హరీశ్. వారి తప్పులు కప్పిపుచ్చడానికే దళితబంధు తెచ్చాడని విమర్శించారు.

“ప్రజలు మరిచిపోయినా.. నీ మోసాలు ప్రజలకు మేం గుర్తు చేస్తాం. దళితబంధు ఆపింది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఎన్జీవోలతో ఫిర్యాదు చేయించి.. ఏదో చేసి దళితబంధు ఆపించిండు. అకౌంట్లు ఎందుకు ఫ్రీజ్ అయ్యాయంటే.. ఖజానాలో నిధులు లేవని అంటున్నారు. అలాంటప్పుడు ఎందుకు ఎనౌన్స్ చేసావ్ ?” అంటూ అరవింద్ కేసీఆర్ ను ప్రశ్నించారు.

ఓడిపోయే దగ్గరకు కేటీఆర్ రాడు. వాళ్ల బావను దుబ్బాకలో తన్నినట్లు… ఇక్కడ కూడా ప్రజలు తంతారు. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటని టీఆర్ఎస్ వాళ్లంటుంటే… టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ వాళ్లంటున్నారు. అలా అయితే ఏసీబీ కేసులో రేవంత్ రెడ్డి ఎందుకు బయట ఉన్నాడు? అని ప్రశ్నించారు.

లొట్టపీసు కేసులో మల్లన్న లోపలెందుకున్నాడు?. చంద్రబాబు, రాహుల్ గాంధీ, కేటీఆర్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కలిసి ఆపరేషన్ హైద్రావతి మొదలుపెట్టారు. అందులో భాగంగానే టీడీపోడు.. కాంగ్రెస్‎కు అధ్యక్షుడయ్యాడని అరవింద్ ఆరోపించారు.

కేటీఆర్ ప్రతిసారి పార్టీలను బలోపేతం చేసుకోవడానికి తమిళనాడు పోతున్నాడు. ఈ సన్నాసికి పార్టీ పెట్టాక 21 ఏళ్లకు బలోపేతం చేసుకోవాలని గుర్తుకొచ్చింది. టీఆర్ఎస్‎లో 80 శాతం, జగన్ పార్టీలో 100 శాతం వలసదారులే. రాష్ట్రంలో కాంగ్రెస్‎ను, టీఆర్ఎస్‎ను పోషించేది పంగనామాల పెద్దమనిషి చంద్రబాబే అంటూ ధ్వజమెత్తారు.

అక్కడ లోకేష్, ఇక్కడ కేటీఆర్ ముఖ్యమంత్రులవుతారట. హుజురాబాద్‎లో నీ కొడుకును పోటి చేయిస్తే అయిపోతుండే అంటూ ఎద్దేవా చేశారు. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ అన్నారు.. ఇచ్చారా? నేను సర్వే చేయిస్తే.. ఈటల రాజేందర్ ప్రజల గుండెల్లో ఉన్నాడని తేలింది. గుండెల్లో ఉన్నోడిని డబ్బులతో కొనగలరా?’ అని అర్వింద్ ప్రశ్నించారు.