
త్వరలో తన సొంత పార్టీని ప్రారంభిస్తానని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అమరీందర్ సింగ్ ప్రకటించారు. సాగు చట్టాలపై ఆందోళన చేస్తున్న రైతుల సమస్యలు పరిష్కరిస్తే, 2022లో జరిగే పంజాబ్ ఎన్నికల్లో బీజేపీతో సీట్ల సర్దుబాటుకు సిద్ధంగా ఉన్నానని ఆయన వెల్లడించారు.
‘‘పంజాబ్ భవిష్యత్తు కోసం యుద్ధం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం త్వరలోనే పార్టీని ఆరంభిస్తాను. ప్రమాదంలో పడిన రాష్ట్ర శాంతిభద్రతల పునరుద్ధరణ కోసం నేను నా శక్తి మేరకు కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నా’’ అని ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.
సీఎం పదవి నుంచి తనను అవమానకర రీతిలో తప్పించిందని రగిలిపోతున్న అమరీందర్ కాంగ్రెస్ పార్టీని సాధ్యమైనంతగా దెబ్బతీసే లక్ష్యంతో పావులు కదుపుతున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూతో తీవ్ర విభేదాల కారణంగా కిందటి నెలలో అమరీందర్ పంజాబ్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేయవలసి వచ్చింది. కాంగ్రెస్ దళిత నేత చరణ్జిత్ సింగ్ చన్నీని కుర్చీపై కూర్చొబెట్టిన విషయం తెలిసిందే.
‘పంజాబీలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తాను. ఏడాదికాలంగా మనుగడ కోసం పోరాడుతున్న రైతుల ప్రయోజనాల కోసం కూడా పాటుపడతాను’ అని అమరీందర్ తన మీడియా సలహాదారు రవీన్ తుక్రాల్ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ‘బీజేపీతో పాటు అకాలీదళ్ చీలికవర్గాలకు చెందిన దిండ్సా, బ్రహ్మపురాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధమే’ అని కెప్టెన్ తెలిపారు.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు