బిజెపిలోకి ఇద్దరు నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు!

బిజెపిలోకి ఇద్దరు నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు!

ఫరూక్ అబ్దుల్లా సారథ్యంలోని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ)కు జమ్మూ కాశ్మీర్ లో గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీ ప్రముఖ నేతలు ఇద్దరు- దేవేంద్ర రాణా, సూర్జిత్ సింగ్ స్లతియాలు ఆదివారంనాడు పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఈ ఇరువురూ సోమవారంనాడు న్యూఢిల్లీలో బీజేపీలో చేరే అవకాశాలున్నాయి.

మాజీ ఎమ్యెల్యే రాణా, మాజీ మంత్రి స్లితాయా రాజీనామాలు డాక్టర్ ఫరూక్ అబ్దుల్లాకు అందాయని, వాటిని ఆయన ఆమోదించారని ఎన్‌సీ ప్రతినిధి ట్వీట్ చేశారు. కాగా, తన రాజీనామా విషయాన్ని రానా ధృవీకరించారు. దశాబ్దంకు పైగా  జమ్మూ రీజియిన్ ఎన్‌సీ ప్రొవిన్షియల్ ప్రెసిడెంట్ గా ఉంటున్న ఆయన మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు సన్నిహితుడు, నమ్మకస్తుడిగా పేరొందారు.

రానా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌‌కు రాణాకు స్వయానా తమ్ముడు కావడం విశేషం. జమ్మూప్రజల ప్రయోజనాలు, వారి ఆశలు, ఆకాంక్షలే తనను ప్రధానమని రాణా తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికలలో జమ్మూ నుండి గెలుపొందిన అతికొద్దిమంది ఎన్‌సీ శాసనసభ్యులలో ఒకరు. ఎన్‌‌సీకి రాజీనామా చేయడం ఆ పార్టీకి దెబ్బగా అనుకుంటున్నారా అనే ప్రశ్నకు..వ్యక్తులు వస్తుంటారు, వెళ్తుంటారని, ఎన్‌సీ చాలా పెద్ద పార్టీ అయినందున ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చని పేర్కొన్నారు. తనకు ఫరూక్ అబ్దుల్లాతోనూ, ఆయన తనయుడు ఒమర్ అబ్దుల్లాతోనూ సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు.

గత వారం, జమ్మూ అనుకూల నాయకులు డోగ్రా స్వాభిమాన్ సంస్థకు చెందిన చౌదరి లాల్ సింగ్,  నేషనల్ పాంథర్స్ పార్టీకి చెందిన హర్ష్ దేవ్ సింగ్ బిజెపికి మారతారనే ఊహాగానాల మధ్య రానాతో సమావేశమయ్యారు. కాశ్మీర్ లోయలో జరుగుతున్న పరిణామాల ఫలితంగా దశాబ్దాలుగా జమ్మూ ప్రాంతం నష్టపోతున్నట్లు భావిస్తున్న ఆయన జనవరి 30 న ‘జమ్మూ డిక్లరేషన్’ ప్రతిపాదించారు. జమ్మూ కాశ్మీర్‌లోని విభిన్న సంఘాలు,  విభిన్న ప్రాంతాల మధ్య ఐక్యత, విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి దీనిని ఉద్దేశించారు.

జమ్మూ ప్రాంత ప్రజల ఆంకాంక్షలు నెరవేర్చడమే తన ప్రధాన లక్ష్యం అని పేర్కొంటూ  ” జమ్మూ డిక్లరేషన్ ‘ ఈ దిశగా రాజకీయ పార్టీలతో సహా అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాల్సిన ప్రయత్నం’ అని ప్రకటించారు. దీనిని జమ్మూ అభివృధ్ధికోసం రూపొందించిన ఒక రాజకీయ మార్గనిర్మాణమని తెలిపారు.

“జమ్మూ కాశ్మీర్‌లోని అన్ని ప్రాంతాలు,  ఉప ప్రాంతాల కోరికలు,  ఆకాంక్షలను గౌరవించడానికి జమ్మూ డిక్లరేషన్ ఒక మార్గం.  రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా ఎవరికీ వివక్ష లేదా ఆధిపత్యం లేదు” అని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేయారు.  జమ్మూ ప్రాంత ప్రయోజనాలను పరిరక్షించడానికి తాను ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని ఆయన చెప్పారు.

జమ్మూ కాశ్మీర్‌కు ఆర్టికల్ 370, రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కోరుతూ ఏర్పడిన  ప్రాంతీయ పార్టీల కూటమి ప్రకటించిన గుప్కర్ డిక్లరేషన్ కు కౌంటర్‌గా జమ్మూ ప్రకటన పరిగణిస్తున్నారు. జమ్మూలో బిజెపి మరింత బలపడడానికి దోహదపడటమే కాకుండా, రాణా ఆ పార్టీకి బలమైన ముఖ్యమంత్రి అభ్యర్థి కాగలరని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.