
ఓ హత్య కేసులో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే కు చెందిన కడలూరు ఎంపీ టీఆర్‌వీఎస్ రమేష్ అరెస్ట్ కు రంగం సిద్ధం కావడంతో రాష్ట్రంలో రాజకీయంగా కలకలం రేగుతున్నది. 2019 ఎన్నికలలో ఎన్నికైన ఆయనపై ఆయనపై శనివారం సీబీసీఐడీ కేసు నమోదు చేసింది. ఆయనకు కడలూరులో జీడిపప్పు పరిశ్రమ ఉంది. ఇక్కడ మేల్ వా పట్టు గ్రామానికి చెందిన గోవిందరాజన్ పనిచేస్తున్నాడు.
ఈయన పీఎంకేలో కార్యకర్త. ఈ పరిస్థితుల్లో గత నెల గోవిందరాజన్ మృతి చెందాడు. అయితే, ఆయన శరీరంపై గాయాలు ఉండడం అనుమానాలకు దారితీసింది.
హత్యకేసు నమోదు చేయాలంటూ కిడంబలూరు పోలీసులను బాధిత కుటుంబం కోరింది. అయితే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయడంతో ఆ కుటుంబం కోర్టును ఆశ్రయించింది.
కోర్టు ఆదేశాల మేరకు జిప్మర్ వైద్య బృందం పర్యవేక్షణలో గోవిందరాజన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించారు. ఈ నివేదిక మేరకు కేసును సీబీఐకి అప్పగించాలని ఆ కుటుంబం పట్టుబట్టింది. ఈ కేసును సీబీసీఐడీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. అధికార పార్టీకి చెందిన ఎంపీ రమేష్‌పై ఆరోపణలు గుప్పుమన్నాయి.
ఆయనే కొట్టి చంపినట్లుగా, బలవంతంగా విషం తాగించినట్లు ప్రచారం జోరందుకుంది. ఈ పరిస్థితుల్లో రంగంలోకి దిగిన సీబీసీఐడీ శనివారం ఎంపీపై హత్య కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. అలాగే ఎంపీ సహాయకుడు నటరాజన్, ఆ పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులు కందవేల్, అల్లాపిచ్చై, సుందర్, వినోద్ పేర్లను కూడా కేసులో చేర్చారు.
నటరాజన్ అనారోగ్యం పేరిట ఆస్పత్రిలో చేరడంతో మిగిలిన నలుగుర్ని సీబీసీఐడీ అరెస్టు చేసింది. కోర్టులో హాజరుపరిచిన అనంతరం వీరిని కడలూరు జైలుకు తరలించారు. ఈ కేసులో ఎంపీ రమేష్‌ను కూడా అరెస్టు చేయడానికి సీబీసీఐడీ వర్గాలు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. గోవిందరాజన్ పరిశ్రమలో చోరికి పాల్పడినట్లు, ఆగ్రహించి ఆయన్ని చితక్కొట్టి హతమార్చినట్లుగా సీబీసీఐడీ గుర్తించినట్లు సంకేతాలు వెలువడ్డాయి.
More Stories
కుంభమేళా విజయవంతం.. సమిష్టి కృషికి నిదర్శనం
ఉగ్రవాదాన్ని కట్టడి చేసేందుకు న్యూజీలాండ్ తో కలిసి పనిచేస్తాం
థానేలో శివాజీ మహరాజ్ ఆలయం ప్రారంభం