కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందే

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందే

దేశంలో కరోనా తగ్గుముఖం పడుతున్నప్పటికీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్‌ సెక్రెటరీ లవ్‌ అగర్వాల్‌ స్పష్టం చేశారు. ప్రతి రోజు దేశంలో సగటున 20 వేల కరోనా కేసులు నమోదవుతున్నాయని, కరోనాపై పోరాటం ఇంకా ముగియలేదని ఆయన పేర్కొన్నారు. 

అధికంగా కరోనా కేసులు 56 శాతం ఒక్క కేరళలోనే నమోదవుతున్నట్టు ఆయన తెలిపారు. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, మిజోరాం, కర్ణాటకలో 10వేల కంటే ఎక్కువ యాక్టివ్‌ కేసులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌, అసోంలోని కొన్ని జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5-10శాతం మధ్య ఉందని, తొమ్మిది రాష్ట్రాల్లోని 34 జిల్లాల్లో పదిశాతాని కంటే ఎక్కువ వీక్లీ పాజిటివిటీ రేటు నమోదువుతుందని ఆయన వెల్లడించారు.

 లక్షద్వీప్, చండీగఢ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, సిక్కిం తదితర రాష్ట్రాల్లో కరోనా  టీకా మొదటి డోస్‌ వేసినట్లు ఆయన తెలిపారు. స్వీయనియంత్రణతోనే కరోనా కట్టడి సాధ్యమని ఆయన తేల్చిచెప్పారు. బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు విధిగా ఆరు అడుగుల సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని ఆయన ప్రజలను కోరారు. 

వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. కేంద్రం విధించిన కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

కాగా, క‌రోనా వైర‌స్‌కు చెందిన ఆందోళ‌న‌క‌ర‌మైన కొత్త వేరియంట్ ఏదీ లేద‌ని నీతి ఆయోగ్ స‌భ్యుడు డాక్ట‌ర్ వీకే పౌల్ తెలిపారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ప్ర‌మాద‌క‌ర వైర‌స్‌లు ఏవీలేవ‌ని చెప్పారు. జైడ‌స్ క్యాడిల్లా కోవిడ్ టీకాల‌ను ప్ర‌వేశ‌పెట్టేందుకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయ‌ని డాక్ట‌ర్కే పౌల్ తెలిపారు. జైడ‌స్ టీకాను సాంప్ర‌దాయ సిరంజీతో వేయ‌మ‌ని, దానికి ప్ర‌త్యేక‌మైన అప్లికేట‌ర్ కావాల‌ని, తొలిసారి దేశంలో అలాంటి ప‌ద్ధ‌తిని వాడ‌బోతున్నామ‌ని, అయితే ఆ విష‌యంలో శిక్ష‌ణ జ‌రుగుతున్న‌ట్లు పౌల్ వెల్ల‌డించారు. 

రైల్వే స్టేషన్ల ప్రాంగణాల్లో తప్పనిసరిగా మాస్కు ధరించాలన్న నిబంధన అమలును రైల్వే బోర్డు మరో ఆర్నెల్లు పొడిగించింది. కరోనా దృష్ట్యా విధించిన ఈ నిబంధన గడువు అక్టోబర్‌తో ముగియనున్నది. దాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 16 వరకు పొడిగిస్తున్నట్టు రైల్వే బోర్డు తెలిపింది. మాస్కులు ధరించని వ్యక్తులకు రూ.500 వరకు జరిమానా విధించడాన్ని కొనసాగిస్తామని హెచ్చరించింది.