2025 నాటికి తైవాన్ దీవుల్ని డ్రాగ‌న్ ఆక్ర‌మించే అవకాశం!

2025 నాటికి తైవాన్ దీవుల్ని డ్రాగ‌న్ దేశం ఆక్ర‌మించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ర‌క్ష‌ణ మంత్రి చియూ కూ చెంగ్ తెలిపారు. చైనా, తైవాన్ మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధం సాగుతోంది. గ‌త 40 ఏళ్ల‌లో ఎన్న‌డూలేనంత‌గా చైనాతో సైనిక సంబంధాలు హీన‌స్థితికి ప‌డిపోయిన‌ట్లు తైవాన్ ర‌క్ష‌ణ మంత్రి వెల్ల‌డించారు.

గ‌డిచిన వారం వ‌రుస‌గా నాలుగు రోజుల పాటు 150 చైనీస్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్‌లను ఎగురుతూ తైవాన్ గగనతలంలో భారీగా చొరబడిన నేపథ్యంలో ఫ్రెంచ్ సెనేటర్లు తైవాన్‌కు చేరుకున్న సందర్భంగా ఈ ప్రకటన వచ్చింది. 

తైవాన్ తనను తాను సార్వభౌమ రాజ్యంగా గుర్తిస్తుంది, కానీ, చైనా తైవాన్‌ను విడిపోయిన ప్రావిన్స్‌గా చూస్తుంది. తైవాన్‌ను త‌మ దేశంలో ఏకీకృతం చేసేందుకు వీలైతే సైనిక చ‌ర్య‌కు కూడా పాల్ప‌డుతామ‌ని ఇటీవ‌ల చైనా ప్రకటించింది. చైనా సాగిస్తున్న ఈ నిరంతర వేధింపులను ఎదుర్కోవలసిన ఆవశ్యకత ఒక సైనిక వ్యక్తిగా తన ముందున్నదని కుయో-చెంగ్ స్పష్టం చేశారు.

తైవాన్ శాసనసభ 8.6 బిలియన్ డాలర్ల  ప్రత్యేక రక్షణ బడ్జెట్ బిల్లును సమీక్షించింది.  ఇందులో మూడింట రెండు వంతుల భూ-ఆధారిత క్షిపణి వ్యవస్థలు వంటి ఓడ నిరోధక ఆయుధాల కోసం ఖర్చు చేయాలనీ నిర్ణయించింది. తైవాన్ తన స్వేచ్ఛలను,  ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందని స్పష్టం చేస్తూ  ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలకు చైనా కారణమని ధ్వజమెత్తారు.

సైనిక వ్యయం కోసం బడ్జెట్ ముందుమాటలో, “సైనిక బెదిరింపులు,  రెచ్చగొట్టడం మునుపటి కంటే ఎక్కువగా ఉంది” అని రాయిటర్స్ నివేదించింది.తైవాన్ ప్రధాన సైనిక సరఫరాదారు అయిన అమెరికా , తైవాన్ పట్ల తన “రాక్-సాలిడ్” నిబద్ధతను ధృవీకరిస్తూ చైనా ధోరణిని తీవ్రంగా విమర్శించింది. చైనా తన సైన్యం ద్వారా ఆధిక్యత ధోరణులను వ్యక్తం చేస్తున్నట్లు ధ్వజమెత్తింది. 

మరోవంక, చైనా దురాక్రమణ ధోరణులను కట్టడి చేసేందుకు తమకు సహకరింపవలసిందిగా ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాలు తైవాన్ కోరింది. ముఖ్యంగా నిఘా, లాజిస్టికల్ మద్దతును అందజేయమని కోరింది.