హుజూరాబాద్ లో తన ఫ్లెక్సీలు లేకుండా చేయగలరేమో కానీ, ప్రజల గుండెల్లో తన ఫోటో లేకుండా చేయలేరని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ వైస్ ఛైర్మన్ సురేందర్ రాజు, ఇతర నేతలు ఆయన సమక్షంలో బీజేపీలో చేరిన సందర్భంగా మాట్లాడుతూ వందల కోట్ల ఖర్చు చేసి ఈటల రాజేందర్‌ను ఓడించగలమనే భ్రమల్లో టీఆర్ఎస్ వాళ్లు ఉన్నారని ఎద్దేవా చేశారు.
“నన్ను బతికుండగానే బొంద పెట్టవచ్చని కేసీఆర్ కలలు గంటున్నాడు. కేసీఆర్ కుట్రలను అమలు చేస్తుంది నా పాత సహచరుడు హరీశ్ రావు. మంత్రులు, ఎమ్మెల్యేలు, వందల సంఖ్యలో నాయకులు ఇక్కడ తిరుగుతున్నారు. ఉద్యమ బిడ్డగా ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు” అంటూ భరోసా వ్యక్తం చేశారు.
“హుజురాబాద్‌లో ఒక్క ఫ్లెక్సీ పెట్టుకోకుండా చేశారు. పెట్టిన జెండాలు తీసేశారు. ఫ్లెక్సీల్లో నా ఫొటో ఉండకపోవచ్చు కానీ, నా ఫొటో ప్రజల గుండెల్లో ఉంది. ఇవాళ మా పార్టీలో చేరుతున్న నాయకుల ఇంటికి రాత్రి పూట వచ్చి టీఆర్ఎస్ నాయకులు బెదిరించారట. వీళ్లంతా వాళ్లను తప్పించుకుని వచ్చి ఈ రోజు బీజేపీలో చేరుతున్నారు” అని తెలిపారు.
నచ్చిన పార్టీలో చేరే స్వేచ్ఛ కూడా లేదా? అని ఈటెల ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. “మీ పార్టీలోకి వచ్చిన వాళ్లంతా తిరిగి నా వెంటే వస్తారు. మీ మందు సీసాలు అయిపోయిన తర్వాత నా దగ్గరకే వస్తారు. మీతో చేరిన వాళ్లంతా నాకు టచ్‌లో ఉన్నారు’ అని స్పష్టం చేసారు.
“ఎంపీటీసీలు, సర్పంచులంతా నాతో మాట్లాడుతున్నారు. కేవలం వాళ్లకు రావాల్సిన బిల్లుల కోసం, అప్పులు తీర్చుకోవడం కోసమే పోతున్నామని నాకు చెబుతున్నారు. ఇప్పుడు బిల్లుల వచ్చాయని, రోడ్లు వేశారని.. ఇక నీవెంట నడుస్తామంటున్నారు. కానీ, నేను అందరినీ తిరిగి నా దగ్గరకు రానీయడం లేదు” అని రాజేందర్ వెల్లడించారు. ఎవరైతే ధర్మంగా, న్యాయంగా ఉంటారో.. అటువంటి వాళ్లనే మళ్లీ తన దగ్గరకు తీసుకుంటా అని తెలిపారు.
తెలంగాణలో దసరా రెండు రోజులు మాత్రమే ఉంటే.. హుజురాబాద్‌లో మాత్రం దసరా రోజూ అవుతుంది. మనకు మద్యం తాగించి ఆరోగ్యాలు పాడు చేస్తున్నారు. మన ప్రాణాలు ఫణంగా పెట్టైనా ఓట్లు పొందాలని చూస్తున్నారని విమరసంచారు. గ్రామాలకు గ్రామాలే బార్లుగా మారుతుంటే.. మనం అడ్డుకట్ట వేయాలని ఆయన పిలుపిచ్చారు.
డబ్బులిస్తే తీసుకోండి… కానీ మద్యం తాగి ఆరోగ్యం పాడు చేసుకోకండని ప్రజలకు హితవు చెప్పారు. మనకు పథకాల రూపంలో ఇచ్చిన డబ్బులన్నీ మన డబ్బులే అని గుర్తు చేశారు. దళితబంధు కేవలం మెసేజ్ రూపంలోనే వచ్చింది. కానీ డబ్బులు మాత్రం చేతికి రాలేదని దుయ్యబట్టారు.
ఈ నెల 30 లోపు దళిత కుటుంబాలందరికీ కలెక్టర్, బ్యాంకుల పెత్తనం లేకుండా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ బంధు కూడా పెట్టాలి. అన్ని కులాల్లోని పేదలకు రూ 10 లక్షలిచ్చి ఆదుకోవాలని ఆయన కోరారు. రైతు అయితే చాలు.. రైతుబంధు ఎలా ఇస్తున్నావో.. పేదరికంలో ఉన్నోళ్లందరికీ కులానికి అతీతంగా పది లక్షలు ఇవ్వాలని స్పష్టం చేశారు.
“వ్యాపారులు ఎవరూ మాతో రావడం లేదు. ఎందుకు రావడం లేదని అడిగితే.. మీ వ్యాపారాలు నడవాలంటే మా పార్టీలోనే ఉండాలని టీఆర్ఎస్ వాళ్లు బెదిరించారని చెబుతున్నారు. నాదగ్గరకు రాకుండా వాళ్లను ఆపవచ్చేమో కానీ.. ఓట్లు వేయకుండా ఆపగలరా?” అని ప్రశ్నించారు.
మన గుండెళ్లో ఉన్న ప్రేమకు ప్రతీక ఓటు. కేసీఆర్ అహంకారానికి, డబ్బు సంచులకు.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇదని పేర్కొన్నారు. యోధానుయోధులు కౌరవుల పక్షమే ఉన్నా… ధర్మం వైపు నిలబడిన పాండువులే గెలిచారని గుర్తు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి.. ధర్మాన్ని గెలిపించాలని కోరారు.
ఇప్పటికే 90 శాతం ప్రజలు ఎవరికి ఓటువేయాలో నిర్ణయించుకున్నారని చెబుతూ వాళ్ల నిర్ణయాన్ని ఎన్ని డబ్బులిచ్చినా మార్చలేరని ధీమా వ్యక్తం చేశారు. పంచీ, పంచీ.. ఇదేం హుజురాబాద్రా అంటున్నారట. అందుకే హుజురాబాద్ చైతన్యానికి ప్రతీక అంటున్నా అని ఈటల పేర్కొన్నారు.

More Stories
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏపీ బిజెపి నేతల ప్రచారం!
‘కాషాయ జెండా’ తొలగింపుతో దుమారం
వందల మొబైల్ ఫోన్లు పేలడంతో బస్సు ప్రమాదం?