మూడేళ్ళ గరిష్టంకు చేరుకున్న ముడి చమురు ధరలు 

పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి (ఒపెక్‌), రష్యా తదితర దాని అనుబంధ దేశాల (ఒపెక్‌ ప్లస్‌) నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల్ని ఒక్కసారిగా పెంచేశారు.  ప్రస్తుత ఉత్పాదక విధానానికే కట్టుబడి ఉంటామన్న ఒపెక్‌ ప్లస్‌ నిర్ణయం బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధరను 1.97 డాలర్లు లేదా 2.8 శాతం పెంచేసింది. 

దీంతో బ్యారెల్‌ విలువ మూడేండ్ల గరిష్ఠాన్ని చేరుతూ 81.48 డాలర్లను తాకింది. న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్సేంజ్‌లోనూ 2.32 డాలర్లు లేదా 3 శాతం ఎగిసి ఏకంగా ఏడేండ్ల గరిష్ఠాన్ని తాకుతూ 78.17 డాలర్లకు చేరింది. భారతీయ కరెన్సీలో ఈ పెరుగుదల రూ.150 నుంచి 175 వరకు ఉన్నది. నవంబర్‌లో రోజుకు 4 లక్షల బ్యారెళ్ల ఉత్పత్తినే పెంచాలని ఒపెక్‌ ప్లస్‌ దేశాలు సోమవారం నిర్ణయం తీసుకున్నాయి.

నిజానికి కరోనా దెబ్బకు కుదేలైన ఆర్థిక వ్యవస్థలు కోలుకోవాలంటే ముడి చమురు ధరలు తగ్గాలని, అందుకు మరింత ఉత్పత్తి మార్కెట్‌లోకి రావాల్సిన అవసరం ఉన్నదని అమెరికా, భారత్‌ వంటి దేశాలు కోరుతున్నాయి. అయితే తాజాగా సమావేశమైన ఒపెక్‌ ప్లస్‌ దేశాల మంత్రుల బృందం మాత్రం మరోసారి కరోనా ముప్పు పొంచి ఉందన్న అంచనాలనే విశ్వసించింది. 

ఈ క్రమంలోనే ఉత్పత్తి పెంపుపై తొందరపాటు పనికిరాదన్న భావనను కనబర్చుతూ గతంలో తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంటామని ప్రకటించింది. కరోనాతో వచ్చిపడిన లాక్‌డౌన్లతో ప్రపంచవ్యాప్తంగా చమురు వినియోగం పెద్ద ఎత్తున పడిపోయి గ్లోబల్‌ మార్కెట్‌లో ధరలు భారీగా పతనమైన విషయం తెలిసిందే. దీంతో ఒపెక్‌ ప్లస్‌ దేశాలకు నష్టాలు మిగిలాయి. అందుకే ఉత్పత్తి విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుండగా, మార్కెట్‌లో ధరలు పరుగులు పెడుతున్నాయి.