
‘హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమంటూ ప్రగల్భాలు పలుకుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఒకవేళ ఆ పార్టీ ఓడిపోతే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమా? కేసీఆర్‌కు దమ్ముంటే సమాధానమివ్వాలి’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు.
హుజూరాబాద్‌లో రాజ్యాంగాన్ని పక్కన పెట్టిన కేసీఆర్.. స్వీయ మానసిక ధోరణిని ప్రజలపై రుద్దుతున్నారని మాజీమంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ దయ్యబట్టారు. 13, 14 తేదీల్లో తనపై తానే దాడి చేయించుకుంటానని ఓ మంత్రి, ఎమ్మెల్యే ప్రచారం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈటల బరిగీసి కొట్లాడుతడు తప్ప చిల్లర పనులు చేయడని స్పష్టం చేశారు.
టీఆర్‌ఎస్ గెలిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని, ఓడిపోతే కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.దళిత బంధు పథకం ద్వారా ఇస్తున్న రూ.పది లక్షలపై లబ్ధిదారులకు సంపూర్ణ హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. జమ్మికుంటలో రజకులు, పద్మశాలీలతో వేర్వేరుగా సమావేశాలలో బండి సంజయ్ తో కలసి పాల్గొంటూ తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు రజకులకు 250 కోట్లతో డ్రైక్లీనింగ్ యంత్రాలు కొనివ్వాలని ప్రతిపాదన చేస్తే.. సీఎం కేసీఆర్ డబ్బులు ఇవ్వలేదని తెలిపారు.
బీజేపీ మీటింగ్‌లకు పోవద్దని దావత్‌లు ఇస్తున్నారని, వినకపోతే బెదిరిస్తున్నారని చెప్పారు. బెదిరింపులకు ప్రతి బెదిరింపులు ఉంటాయని, తమ సహనానికి పరీక్ష పెట్టొద్దని హెచ్చరించారు. మగ్గం నేసే బిడ్డలకు హుజూరాబాద్‌లో మొదటిసారి మోటర్లతో నడిచే మగ్గాలు మంజూరు చేసినట్లు తెలిపారు. దొంగ చెక్కులు ఇచ్చి పబ్బం గడుపుకోవాలని చూస్తే భరతం పడతామని హెచ్చరించారు.
తాను కార్పొరేటర్‌గా ఉన్నప్పుడు ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నారని, అప్పుడు ఆయన ఓ కేసు విషయంలో సహాయం చేశారని, లేకపోతే తాను జైలుకు వెళ్లేవాడినని బండి సంజయ్ తెలిపారు. తనతో పాటు 15 మంది రజకులు కూడా జైలుకు వెళ్లవలసి వచ్చేదని పేర్కొన్నారు. కల్మషం లేని వ్యక్తి ఈటల అని కొనియాడారు. హుజూరాబాద్‌కు దండుపాళ్యం ముఠా ప్రచారానికి వచ్చిందని, సగం డబ్బులు ఇచ్చి, సగం దోచుకుపోతారని ఎద్దేవా చేశారు.
ప్రజా సంగ్రామయాత్ర తొలిదశ పూర్తయిన నేపథ్యంలో ఆదివారం చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ సతీసమేతంగా పూజలు నిర్వహించారు. తొలిదశ యాత్ర విజయవంతమైందని సంతోషం ప్రకటించారు. కమలాన్ని గెలుపొందించాలని కంకణం కట్టుకుందాం అని పిలుపునిచ్చారు.
ఇలా ఉండగా, హుజూరాబాద్ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పేరును బీజేపీ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 30న జరుగనున్న ఉప ఎన్నికకు గాను, 5న ఈటల తరఫున ఆయన సతీమణి జమున.. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. 8న ఈటల నామినేషన్ వేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
More Stories
సందడిగా దత్తాత్రేయ `అలయ్ బలయ్’
భీమస్మృతి మనకు మార్గదర్శకం, మనుస్మృతి కాదు
పంటలకు జీవ ఉత్ప్రేరకాలఅమ్మకంపై నిషేధం