
దేశంలో కేన్సర్ చికిత్సకు ఖర్చు ఎక్కువగా ఉందని, దీన్ని తగ్గించేందుకుప్రయత్నాలు చేయాలని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. కేన్సర్ బారినపడిన పేదలు, సంపాదనంతా చికిత్సకు ఖర్చు చేయాల్సి వస్తుందనే ఆందోళనతో వైద్యానికి మొగ్గుచూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ లో ఉషాలక్ష్మి బ్రెస్ట్ కేన్సర్ ఫౌండేషన్ ‘యూబీఎఫ్ హెల్ప్’ను ఆన్లైన్ వేదికగా ఆయన ప్రారంభించారు. తెలుగు, కన్నడ, తమిళంతో సహా 11 భారతీయ భాషల్లో ఈ హెల్ప్‌లైన్ నడపాలన్న ఆలోచనను ప్రశంసించారు.
కేన్సర్లలో మూడోవంతు ఆరోగ్యవంతమైన జీవన శైలి ద్వారా నిరోధించవచ్చునని ఉపరాష్ట్రపతి చెప్పారు. దేశవ్యాప్తంగా తొలిసారి ఉషాలక్ష్మి బ్రెస్ట్ కేన్సర్ ఫౌండేషన్ హెల్ప్‌లైన్ సేవలు ప్రారంభించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఎవరికైనా అనుమానాలుంటే వెంటనే హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చునని చెప్పారు.
దేశంలో ఏటా 23 లక్షల మంది మహిళలు రొమ్ము కేన్సర్ బారిన పడుతున్నారని, 6.85 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు బ్రెస్ట్ కేన్సర్‌పై అవగాహన కల్పించడంతో పాటు వారి అనుమానాలు నివృత్తి చేసేందుకు ఉచితంగా హెల్ప్‌లైన్ ప్రారంభించిన ఉషాలక్ష్మి బ్రెస్ట్ కేన్సర్ ఫౌండేషన్, డాక్టర్ రఘురాం బృందాన్ని అభినదించారు.
‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్’ భారతదేశంలో ప్రజారోగ్య సంబంధ విషయాల్లో విప్లవాత్మక మార్పు అని చెబుతూ అందులో ప్రతి భారతీయుడు స్వచ్ఛందంగా భాగస్వామి కావాలని ఆయన పిలుపిచ్చారు. ప్రతి భారతీయుడికీ ప్రత్యేకమైన ఆరోగ్య గుర్తింపు కార్డుతోపాటు ఆరోగ్య వివరాలన్నీ డిజిటటైజేషన్ చేయడం వల్ల చికిత్స అందించడం సులభం అవుతుందని ఆయన చెప్పారు
మారుతున్న జీవనశైలి కారణంగానే మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి అసంక్రమిత వ్యాధులు పెరిగిపోతున్నాయని గుర్తుచేశారు. వ్యాయామం, ఆరోగ్యకరమైన, పౌష్టికాహారాన్ని తీసుకోవడం, యోగ, ధ్యానం వంటి వాటి ద్వారా ఒత్తిడిని జయించడం వంటివి నిత్య జీవితంలో భాగంగా చేర్చుకోవడం ద్వారా కొంతమేర ఈ వ్యాధుల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని ఆయన సూచించారు.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత