తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో రూ 43 కోట్ల గోల్‌మాల్‌

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీకి చెందిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో గోల్‌మాల్‌ జరిగింది. యుబిఐ లో తెలుగు అకాడమీ డిపాజిట్‌ చేసిన రూ.43 కోట్లను స్వాహా చేశారు. యుబిఐ బ్యాంకులో తాము డిపాజిట్‌ చేసిన రూ.43 కోట్లు మాయమయ్యాయంటూ అకాడమీ ప్రతినిధులు హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
అధికారపత్రాలు చూశాకే నగదును బదిలీచేశామని, తెలుగు అకాడమీలోని వ్యక్తులే వాటిని విత్‌డ్రా చేసుకున్నారని యుబిఐ ఉన్నతాధికారులు పోలీసులకు తెలిపారు. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో తెలుగు అకాడమీ దశాబ్దాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
 
ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ నిధులను ఆంధ్రప్రదేశ్‌కు పంచాలంటూ కొద్దిరోజుల క్రితం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో భవనాలు, నగదు వివరాలను లెక్కిస్తుండగా వివిధ బ్యాంక్‌లతోపాటు యుబిఐ కార్వాన్‌, సంతోష్‌నగర్‌ శాఖల్లో రూ.43 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లున్నట్లు నిర్థారణ అయ్యింది.
గడువు తీరకముందే వాటిని తీసుకోవాలని అకాడమీ అధికారులు నిర్ణయించారు. అందుకై ఈ నెల 21న డిపాజిట్‌ పత్రాలు బ్యాంకుకు చేరినా అటువైపు నుంచి సమాచారం లేకపోవడంతో మూడు రోజుల తర్వాత తెలుగు అకాడమీ ఉద్యోగి రఫీక్‌ నేరుగా బ్యాంకుకు వెళ్లి ఆరా తీశారు. ఆగస్టులోనే రూ.43 కోట్లు విత్‌డ్రా అయ్యాయని బ్యాంకు అధికారులు చెప్పడంతో దిగ్బ్రాంతికి గురయ్యారు. .

బ్యాంకు అధికారులు ఇచ్చిన వివరణ ప్రకారం గతేడాది డిసెంబరు నుంచి ఈ ఏడాది జులై వరకూ తెలుగు అకాడమీ అధికారులు వివిధ దశల్లో రూ.43 కోట్లు డిపాజిట్‌ చేశారు. అనంతరం ఆగస్టులో యుబిఐ శాఖల నుంచి నగదును విత్‌డ్రా చేసుకుని హైదరాబాద్‌లోని రెండు సహకార బ్యాంకుల్లో రూ.11.37 కోట్లు డిపాజిట్‌ చేశారు. 
 
రూ.5.70 కోట్లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలుగు అకాడమీ ఖాతాకు బదిలీ చేశారు. మిగిలిన రూ.26 కోట్లు తెలుగు అకాడమీ అధికారులు విత్‌డ్రా చేసుకున్నారు. బ్యాంకు అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం… డిపాజిట్‌ సొమ్ము ఆగస్టులోనే వేరే చోటుకు మారింది.
 
అప్పుడు సమర్పించిన డిపాజిట్‌ పత్రాలు కానీ లేదా సెప్టెంబరు 21 న పంపినవి కానీ నకిలీవి అయి ఉండాలని పోలీసులు అనుమానిస్తున్నారు. సరైన అధికారిక పత్రాలు చూశాకే డిపాజిట్‌ సొమ్ము చెల్లించామని బ్యాంకు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇంతకూ నగదును విత్‌డ్రా చేసింది ఎవరో తేల్చేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.