
ఇప్పటి వరకు తాను ఒక సామజిక కార్యకర్తగా వ్యవహరించానని, ఇప్పుడు తనను కవ్వించిన అధికార పార్టీ వైసీపీపై రాజకీయ పోరాటానికి సై అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పార్టీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో ఆ పార్టీ ఘోరంగా ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.
ఇప్పటి వరకు రాష్ట్రాన్ని రెండు కులాలవారు పాలించారని అంటూ రాజకీయ అధికారానికి దూరంగా ఉంటూ వస్తున్న వర్గాలు, కులాలకు సముచిత ప్రాతినిధ్యం లభించేటట్లు చూడడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. కులాల చిచ్చు పెట్టె రాజకీయాలు సహించనని అధికార పార్టీని హెచ్చరించారు.
‘నేను యుద్ధం ప్రకటించను.. కాని మీరులాగితే వదిలి వెళ్లను. నన్ను తిడితే భయపడతారనుకుంటున్నారేమో.. ఎంత భయపెడితే అంతగా బలపడతాను. వైసిపి నాయకులకు భయమంటే ఏమిటో చూపిస్తా…. ఇది ఇడుపులపాయ కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం..’ అని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలకు డబ్బు, అధికారం, మదం, మాత్సర్యం పుష్కలంగా ఉన్నాయని, భయం ఒక్కటే లేదని చెప్పిన ఆయన.. వారికి తాను కచ్చితంగా భయం నేర్పిస్తానని స్పష్టం చేశారు. వైసిపి కేవలం కిరాయి గూండాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో జరుగుతున్న అరచక, అవినీతి, నేరమయ చర్యలపై ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తూనే ఉన్నానని వెల్లడించారు. తన ఇంట్లో కలుపుమొక్కలు తీయడం ఎంత ఇష్టమో.. రాజకీయాల్లో కలుపు మొక్కలు కూడా తీయడానికే వచ్చానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాశ్మీర్ లోయ నుండి కాశ్మీర్ పండిట్ లను వెళ్లగొట్టిన్నట్లు ఏపీ నుండి ఒక కులం వారిని వెళ్లగొట్టె ప్రయత్నం జరుగుతున్నదని ఆరోపిస్తూ, తమ పార్టీ అటువంటి వారికి అండగా నిలుస్తుందని ప్రకటించారు.
వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి శూన్యమని ఆయన విమర్శించారు. పేదలకు నిత్యావసర వస్తువులపై వివిధ రకాల పన్నులను మోపుతూ ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. ప్రజల కష్టార్జితాన్ని పన్నుల రూపంలో దోచుకునే హక్కు ప్రభుత్వానికి లేదని హెచ్చరించారు. వృద్ధులకు పింఛన్లు ఇవ్వడంలో అలసత్వం వహిస్తున్నారని పేర్కొంటూ మద్యపాన నిషేధం అని చెప్పి ప్రభుత్వమే మద్యాన్ని అమ్ముతుందని, ఆఖరికి మాంసం దుకాణాలనుసైతం ప్రభుత్వమే నడిపించే స్థాయికి దిగజారిందని ఎద్దేవ చేశారు.
రాష్ట్రంలో రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయని, వాటికి మరమ్మతులు చేసిన దాఖలాలు వైసిపి పాలనలో ఇప్పటి వరకు లేదని ఆరోపించారు. వివిధ రకాల పన్నులు, మద్యం వ్యాపారాలు, జీఎస్టీలతో సహా వైసిపి చెప్పిన విధంగా రాష్ట్ర ఆదాయం లక్షకోట్లకు పైగా ఉంటుంది. అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని పవన్ కళ్యాణ్ వైసిపిపై తీవ్ర విమర్శలు చేశారు.
పవన్ కల్యాణ్‌ను ధైర్యంగా ఎదుర్కోలేక వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ.. సినిమా వాళ్లను వాడుకుంటున్నారని జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా ఆర్థిక సంక్షోభం నెలకొందని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మన వంతు కృషే లక్ష్యమని పార్టీ నేతలకు పిలుపు ఇచ్చారు. రాజకీయాల్లో అందరికి అవకాశాలు ఇవ్వడమే జనసేన ఆశయమని స్పష్టం చేశారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారనే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. పనికిమాలిన వ్యక్తులను రెచ్చగొట్టి దాడులకు కారణమవుతున్నారని పేర్కొంటూపరిపాలన చేతగానప్పుడు ఇంట్లో కూర్చోవాలని హితవు చెప్పారు. కరోనా సమయంలో జగన్ క్షేత్రస్థాయి పరిశీలన చేశారా? అని ప్రశ్నించారు. తుపానులు వచ్చినప్పుడు జగన్ ఎక్కడని నాదెండ్ల మనోహర్ నిలదీశారు.
More Stories
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
బీహార్ లో ఎన్డీఏ – మహాఘట్ బంధన్ నువ్వా నేనా?
హిండెన్‌బర్గ్ ఆరోపణలపై అదానీకి సెబీ క్లీన్చిట్