సైబర్, రాడార్, డ్రోన్ యుద్దాలపై అప్రమత్తం కావాలి

మారుతున్న భౌగోళిక వ్యూహాత్మక పరిస్థితుల నేపథ్యంలో, సాంప్రదాయ యుద్ధ తంత్రాలలోనే కాకుండా  సమాచార, సైబర్ యుద్ధాలు జరుగుతున్న సమయంలో భద్రతాబలగాలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవపు వెంకయ్యనాయుడు సూచించారు.  బయటనుంచి, అంతర్గతంగా కూడా దేశాన్ని అస్థిరపరిచేందుకు జరుగుతున్న కుట్రలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

రాజస్థాన్‌లోని జైసల్మేర్ లో భారత ఆర్మీ 12 రాపిడ్ డివిజన్ బలగాలు, అధికారులనుద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగీస్తూ  సమాజంలో అభివృద్ధి జరగాలంటే అంతకుముందే శాంతి నెలకొనడం తప్పనిసరని తెలిపారు. ఈ దిశగా భారతదేశ భద్రతాదళాలు చేస్తున్న కృషి, త్యాగం మరవలేనివని ఆయన పేర్కొన్నారు.

విపత్కర, విషమ పరిస్థితుల్లోనూ దేశభద్రతే లక్ష్యంగా వారు చేస్తున్న సేవలను ప్రతి భారతీయుడూ గుర్తుంచుకోవాలని చెప్పారు. గోల్డెన్ సిటీ – జైసల్మేర్‌ను దర్శించడం చాలా ఆనందదాయకమన్న ఉపరాష్ట్రపతి ఈ నగరం రాజస్థాన్ సంస్కృతి, భారత మిలటరీ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తోందని తెలిపారు.

రాజస్థాన్ లో ఐదురోజుల పర్యటన సందర్భంగా, అంతకుముందు లోంగేవాలా యుద్ధక్షేత్రాన్ని సందర్శించిన విషయాన్ని గుర్తుచేస్తూ మేజర్ కుల్దీప్ సింగ్ వీరోచిత గాథను, భారత సైనికుల పరాక్రమాన్ని ప్రతిబింబించిన ఘట్టాలతో రూపొందించిన సందర్శనశాల (మ్యూజియం)ను చూసి ఉద్వేగానికి గురయ్యానని పేర్కొన్నారు.

1971 భారత్-పాక్ యుద్ధానికి 50 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ‘స్వర్ణిమ్ విజయ్ వర్ష్’ కార్యక్రమం ఏర్పాటుచేయడం, 12 రాపిడ్ డివిజన్ సైనికులు నాడు చూపిన శౌర్య, పరాక్రమాలను గుర్తుచేసుకోవడమేనని తెలిపారు. అనంతరం జోధ్‌పూర్ బయలుదేరిన ఉపరాష్ట్రపతి, అక్కడ చారిత్రక మెహరాన్‌గఢ్ కోటను సందర్శించారు. కోట నిర్మాణం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉందని చెప్పారు. 

శీష్ మహల్, ఫూల్ మహల్, జానకీ మహల్ లను నిర్మించిన తీరు సమ్మోనహంగా ఉందని పేర్కొన్నారు. వీటిని కట్టిన కళాకారుల ప్రతిభను అభినందించకుండా ఉండలేమని చెప్పారు. ఈ కోటనుంచి జోధ్‌పూర్ నగరం చాలా అందంగా కనిపించిందని తెలిపారు. రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా, రాజస్థాన్ మంత్రి డాక్టర్ బులాకీదాస్ కల్లా  ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.