
25 వేల ఎకరాల్లో స్పోర్ట్స్ విలేజీ నిర్మిస్తామని చెప్పి… ఉన్న స్టేడియాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లవుతున్నా ఇంత వరకు రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీనే తీసుకురాలేదని ఆయన విమర్శించారు.
రాష్ట్రంలోని ప్రధాన స్టేడియాలని ప్రైవేట్ వ్యక్తులకు కట్టపెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గచ్చిబౌలి స్టేడియంలోని స్థలాన్ని ఇతర సంస్థలకు ఇవ్వడానికి కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గచ్చిబౌలి స్టేడియం టవర్ లో టిమ్స్ అభివృద్ధి చెందాలని అనుకున్నామని చెప్పారు.
అయితే స్టేడియం మధ్యలో 5 ఎకరాల స్థలాన్ని టీమ్స్ కు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, సంబంధం లేని వ్యక్తులతో పంచనామా పై సంతకం చేయించారని విమర్శించారు. ఈ నిర్ణయాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, క్రీడా కారులతో, క్రీడా ప్రేమికులతో కలసి ఈనెల 28న మంగళవారం నుంచి ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రఘునందన్ రావు హెచ్చరించారు.
పీవీ సింధు ఏ అంతర్జాతీయ వేదిక పైన కూడా ఆంధ్ర క్రీడాకారిణి గానే ప్రజంట్ చేసుకుంటుంది తప్ప తెలంగాణ గురించి మాట్లాడడం లేదని ఆయన గుర్తు చేశారు. మంత్రి కేటీఆర్ కు ఆటలకు ఏం సంబంధం ఒలింపిక్ అసోసియేషన్ లో వేలు పెట్టారని రఘునందన్ రావు ప్రశ్నించారు.
జయేష్ రంజన్ ని ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యారని, 20 నెలలుగా బాధ్యతలు తీసుకోలేదని గుర్తు చేసారు, అధ్యక్షుడు గా బాధ్యతలు తీసుకోవడానికి ఆయనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. గజ్వేల్ లో రూ 50 కోట్లతో స్టేడియం కట్టడం కాదు హైదరాబాద్ లో ఉన్న స్టేడియాలని అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
క్రీడల శాఖ మంత్రి నియోజక వర్గానికి స్టేడియం మంజూరు చేయరు కానీ… గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో మాత్రం స్టేడియాలు మంజూరు చేసుకున్నారని ఆయన విమర్శించారు. కాగా, టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసెంబ్లీ బీఏసీ సమావేశానికి బిజెపిని ఆహ్వానించడం లేదని బీజేపీ ఎమ్మెల్యే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ అంటే తమకు గౌరవం ఉన్నా, ఆయన తీరే సరిగా లేదని చెప్పారు.
బీఏసీ మీటింగ్కు తమను పిలవకపోవడంపై సోమవారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతామని రఘునందన్ రావు తెలిపారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోతే.. టీడీపీకి పట్టిన గతే రానున్న రోజుల్లో టీఆర్ఎస్కూ పడుతుందని ఆయన హెచ్చరించారు.
More Stories
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!
సిబిఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు?