
‘తెలంగాణ సీఎం కేసీఆర్ అబ్బ జాగీరు కాదు.. బీజేపీలో ఉన్న వారికి దళితబంధు ఇవ్వబోమని అంటున్నారట.. ఎలా ఇవ్వరో నేనూ చూస్తాను’ అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రా జేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ డబ్బుకు కేసీఆర్ ఓనర్ కాదు.. కాపలాదారుడు మాత్రమేనని స్పష్టం చేశారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లిలో ఈటల సమక్షంలో పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కనాడు కూడా హుజూరాబాద్ నియోజకవర్గం ముఖం కూడా చూడని వారు ఇక్కడ హంగామా చేస్తున్నారని చెప్పారు. గొర్ల మందల మీద పిచ్చి కుక్కలు, తోడేళ్లు దాడి చేసినట్లు, పంటల మీద మిడతలు దాడి చేసినట్లు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
తానేం ఏం పాపం చేశానని దాడి చేస్తున్నారని ఈటెల ప్రశ్నించారు. కొడుకు(కేటీఆర్)ను ముఖ్యమంత్రిని చేసేందుకు కేసీఆర్ కుట్ర పన్ని తనను పక్కకు తోశారని రాజేందర్ ఆరోపించారు. తాను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాలను వదిలిపోతానని, కేసీఆర్, హరీశ్‌రావు తమ పదవులకు రాజీనామా చేస్తారా అంటూ సవాల్ విసిరారు.
మల్లన్నపల్లి సర్పంచ్ బీజేపీలో ఉన్నారని పనులు ఇవ్వడం లేదని ఈటెల ఆరోపించారు. తన పోటీ కేసీఆర్‌తోనని స్పష్టం చేశారు. తాను పోయిన నాడు ప్రజలు కంటతడి పెట్టాలనేలా బతుకుతున్నానని, డబ్బులు ఎంత సంపాదించానని కాదు.. ఎంత ప్రేమ సంపాదించామనేదే ముఖ్యమని పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో దౌర్జన్యం జరిగితే మొదట చిందేది తన రక్తపు బొట్టే అని స్పష్టం చేశారు.
ఇక్కడ ధర్మానికి, న్యాయానికి స్థానం ఉంటుందని, ప్రశాంతంగా ఉంటామని, తమ జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు హుజూరాబాద్‌లో ఖర్చు చేసిన డబ్బులు కేసీఆర్ కుటుంబం కూలీకి పోయి సంపాందించినవా అని నిలదీశారు.
More Stories
కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ కాల్చివేత
నక్సల్స్ రహిత జిల్లాలకు మహర్థశ
మావోయిస్టులతో సంబంధాలు తెంచుకోండి