ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాలలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య (పిపిపి) పద్ధతిలో మౌలిక సౌకర్యాల అభివృద్ధి జరగాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు. దేశానికి 600 వైద్య కళాశాలలు, 50 ఎయిమ్స్ తరహా వైద్య సంస్థలు, 200 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అవసరం ఉందని ఆయన తెలిపారు.
మహారాష్ట్రలోని సతారా జిల్లా కరడ్ నగరంలో కరోనా వారియర్స్కు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొంటూ వైద్య సౌకర్యాలు కల్పించేందుకు సహకార రంగం కూడా ముందుకు రావాలని కోరారు. ఒకసారి ప్రధాని నరేంద్ర మోడీతో చర్చల సందర్భంగా తాను దేశంలో వెంటిలేటర్ల కొరతను ప్రస్తావించానని ఆయన తెలిపారు.
దేశంలో ఎన్ని వెంటిలేటర్లు ఉన్నాయని ప్రధాని అడగగా సుమారు 2.5 లక్షలు ఉండవచ్చని తాను చెప్పానని, అయితే దేశంలో కరోనా వైరస్ సంక్షోభం ప్రబలిన తొలినాళ్లలో కేవలం 13,000 వెంటిలేటర్లు మాత్రమే ఉన్నాయని ప్రధాని తనకు చెప్పారని ఆయన వివరించారు. ఆ సమయంలో దేశంలో ఆక్సిజన్, పడకలు, ఇతర వైద్య సౌకర్యాలకు తీవ్ర కొరత ఉందని గడ్కరీ చెప్పారు.
ప్రభుత్వ నిర్వహణలోని ఆసుపత్రులతోపాటు సహకార, ప్రైవేట్ రంగంలోని ఆసుపత్రులు సైతం వైద్య సౌకర్యాల మెరుగుదలకు అద్భుతమైన సేవలందచేశాయని గడ్కరీ ప్రశంసించారు. ప్రతి తహసిల్లో కనీసం ఒక పశు వైద్యశాలను కూడా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

More Stories
ఢిల్లీ పేలుడు కిరాతక ఉగ్ర ఘాతుకం
డిసెంబర్ 6న భారీ ఉగ్రదాడికి ఉమర్ కుట్ర
26/11 ఉగ్రదాడి తరహా 200 ఐఈడీలతో ఢిల్లీలో దాడులకు కుట్రలు