డిజిటల్‌ క్వాలిటీ ఆఫ్‌ లైఫ్‌లో భారత్‌కు 59వ స్థానం

డిజిటల్ క్వాలిటీ ఆఫ్‌ లైఫ్‌ ఇండెక్స్‌ (డీక్యూఎల్‌) లో భారతదేశం మెరుగైన ర్యాంకు సంపాదించింది. ప్రపంచంలో 59 వ స్థానంలో భారత్‌ ఉంది ఈ-సెక్యూరిటీ విషయంలో చైనా కంటే మెరుగ్గా భారతదేశం ఉండటం సంతోషించదగిన విషయం. డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ మూడవ వార్షిక ఎడిషన్ నివేదికను విడుదల చేశారు.

డీక్యూఎల్‌ నివేదిక ప్రకారం, ప్రపంచంలోని 110 దేశాలలో భారతదేశం 59 వ స్థానంలో ఉన్నది. ప్రపంచ జనాభాలో 90 శాతం మందిని కవర్ చేస్తూ సైబర్ సెక్యూరిటీ కంపెనీ సర్ఫ్‌షార్క్ డీక్యూఎల్‌ అధ్యయనాన్ని నిర్వహిస్తున్నది. ఐదు ప్రాథమిక డిజిటల్ పాయింట్ల ఆధారంగా దేశాలను స్థానాన్ని అంచనా వేస్తుంది. 

ఈ-గవర్నమెంట్‌లో భారతదేశం 33 వ స్థానంలో, ఈ-సెక్యూరిటీలో 36, ఇంటర్నెట్ స్థోమతలో 47, ఇంటర్నెట్ నాణ్యతలో 67 వ స్థానంలో ఉండగా.. ఈ-ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో మాత్రం 91 వ స్థానంలో నిలిచింది. మొత్తమ్మీద, గత ఏడాది నివేదికతో పోలిస్తే భారతదేశం స్వల్ప తగ్గుదలని ప్రదర్శించింది.

భారతదేశం ఇప్పుడు ఆసియాలో 17 వ స్థానంలో, దక్షిణ ఆసియా ప్రాంతంలో మొదటి స్థానంలో ఉన్నది. గత సంవత్సరం నుంచి భారతదేశం ఈ-సెక్యూరిటీ 76 శాతం మెరుగుపడింది. ప్రస్తుతం చైనా కంటే ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో గుర్తించారు.