కేసీఆర్ కుట్రలను అమలు చేస్తున్న మంత్రి హరీష్

‘నా ముఖం అసెంబ్లీలో కనిపించవద్దని.. రాష్ట్రంలో పరిపాలన పక్కన పెట్టి, హుజూరాబాద్‌లో ఎలాగైనా గెలవాలని సీఎం కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రలను మంత్రి హరీశ్‌రావు అమలు చేస్తున్నారు’అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ ఆరోపించారు. ఆయన హుజూరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ, ‘అన్ని కులాల బంధువులారా మీకు జీవోల రూపంలో కేసీఆర్‌ కత్తి ఇస్తున్నారు. ఆ కత్తితో పేదల గొంతుక అయిన ఈటల రాజేందర్‌ను పొడిచి చంపమని చెపుతున్నారు’ అంటూ హెచ్చరించారు.
 
`నేను రాజీనామా చేసి 4 నెలల 22 రోజులు అయింది. అప్ప టి నుంచి హుజూరాబాద్‌లో వందల సంఖ్యలో టీఆర్‌ఎస్‌ నాయకులు మోహరించి, ప్రజాస్వా మ్యం అపహాస్యం అయ్యేలా పని చేస్తున్నారు’అని విమర్శించారు. కేసీఆర్‌కు కలలో కూడా హుజూరాబాదే కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు స్థానిక నాయకులకు దావత్‌లు ఇచ్చి స్వయంగా వారే వడ్డిస్తున్నారని, మందు పోస్తున్నారని ధ్వజమెత్తారు.  ఇప్పటికే నాయకుల కొనుగోళ్లకి రూ.200 కోట్లు ఖర్చు పెట్టారని విమర్శించారు.
ఇతర పార్టీల వారిని వేధించి, బెదిరించి టీఆర్‌ఎస్‌ కండువాలు కప్పుతున్నారని, ప్రజాస్వామ్య వాదులు దీనిని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్ని సంఘాలకు భవనాలు, గుడులు కట్టిస్తాం అని జీవోలు ఇస్తున్నారని.. శంకుస్థాపనలు చేస్తున్నారని, ఇవన్నీ ప్రజల మీద ప్రేమతో ఇవ్వడం లేదని, ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్‌ ఇస్తున్నారని పేర్కొన్నారు.
2 గుంటలు ఉన్నవానికి 200 ఎకరాలు ఉన్న వానికి జరుగుతున్న ఎన్నిక అంటూ టీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2 గుంటలు ఉన్న అతను ఎలా రూ 200 కోట్లు పెట్టి నాయకులను కొన్నారని ప్రశ్నించారు. దళితుల మీద ప్రేమతో దళిత బంధు రాలేదని, కేవలం దళితుల ఓట్ల మీద ప్రేమ మాత్రమే ఉందని స్పష్టం చేశారు.
కేసీఆర్ కు నిజంగా ప్రేమ ఉంటే మొత్తం దళిత బంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని బకాయిలు పెండింగ్ లోనే ఉన్నాయని ఈటల పేర్కొన్నారు. రూ. 4 వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బాకి ఉందన్న ఆయన.. మంత్రి హరీష్ దానిపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని నిలదీశారు.
గత ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా 57 సంవత్సరాల లోపు పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పెంచన్లకే డబ్బులు లేవని, ఆర్థిక వ్యవస్థ కుదేలైందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ భూములు అమ్మితే తప్ప జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల పాలుచేశారని పేర్కొన్నారు.
కాగా, హుజూరాబాద్ ఉప ఎన్నికలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను లక్ష మెజారిటీతో గెలిపిస్తామని భరోసా ఇస్తున్నారని ఆయన సతీమణి ఈటల జమున వెల్లడించారు. వీణవంక మండలం శ్రీరాములపల్లి గ్రామంలో అనే ఇంటింటి ప్రచారం నిర్వహించిన  సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈటల రాజేందర్ కు అన్యాయం చేశారని బాధపడుతున్నారని తెలిపారు. 
 
ఈటల రాజేందర్ కి తాము  అండగా ఉంటామని అందరూ తమకు మద్దతు తెలుపుతున్నారని ఆమె చెప్పారు. “ఇప్పటివరకు ఈటల రాజేందర్ మాకు సేవ చేశారు.. ఈ సారి మేము ఆయనకు అండగా ఉంటాము” అని ప్రజలు అంటున్నారని ఆమె తెలిపారు.
పెద్దలు, పిల్లలు యువకులు అందరూ అండగా ఉంటామని చెబుతున్నారని జామున సంతోషం వ్యక్తం చేశారు. శ్రీరాముల పేటలో ఒక్కరు కూడా ఇంట్లో ఉండకుండా బయటికి వచ్చి తమకు మద్దతు తెలపడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈసారి కేసీఆర్ కి బుద్ది చెప్పడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.