కుల గణన కుదరదు … కేంద్రం స్పష్టం

కుల గణన కుదరదు … కేంద్రం స్పష్టం
2021 జనాభా లెక్కల్లో ఒబిసి జనగణనను చేర్చాలని ఎలాంటి ఆదేశం ఇవ్వొద్దని అత్యున్నత న్యాయస్థానాన్ని కేంద్ర ప్రభుత్వం  కోరింది. జనగణనతో బాటు ఒబిసి కులాలకు సంబంధించిన సమాచారం సేకరించడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. జనగణనతో పాటే కుల గణన చేపట్టేలా జనాభా లెక్కల సేకరణ విభాగాన్ని ఆదేశించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అభ్యర్థనను వ్యతిరేకిస్తూ కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ గురువారం ఈ మేరకు ఒక అఫిడవిట్‌ను దాఖలు చేసింది. 
 
పైగా,  ఒబిసి జనాభా లెక్కల సేకరణ పాలనా పరంగా క్లిష్టతరమైనది, కచ్చితత్వానికి సంబంధించి ఇబ్బందులెదురవుతాయని చెప్పింది. 
2020 జనవరి7న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన సమాచారం తప్ప ఇతర ఏ కులాలకు సంబంధించిన సామాజిక, ఆర్థిక సమాచారాన్ని సేకరించరాదని పేర్కొన్న విషయాన్ని కేంద్రం సుప్రీంకు తెలియజేసింది. 
 
కాబట్టి కుల గణనకు సంబంధించి జనాభా సేకరణ విభాగానికి ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా, అది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని స్పష్టం చేసింది. ఇది సరైన పద్ధతి అనిపించుకోదని కూడా పేర్కొంది. 
 
కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని సమర్థించుకొంటూ ఇది ఎస్‌సి, ఎస్‌టి చట్టంలోని సెక్షన్‌ 8 ప్రకారం రూపొందించబడిన విధాన నిర్ణయం కాబట్టి ఇందులో కోర్టుల జోక్యం కూడదని వాదించింది. 2011 జనాభా లెక్కల సమయంలో చేపట్టిన కులాల సామాజిక, ఆర్థిక సమాచార సేకరణలో గందరగోళం వల్ల ఆ డేటా ఇప్పటికీ బయటకురాలేదని పేర్కొంది. 
 
ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన జనాభా లెక్కల సేకరణకు మాత్రమే రాజ్యాంగంలో ఆదేశించబడింది, ఒబిసి, బిసిసిల జనాభా గణన గణాంకాలను అందించాలని రిజిస్ట్రార్‌ జనరల్‌, జనాభా లెక్కల కమిషనర్‌కు ఆదేశించాలని రాజ్యాంగం పేర్కొనలేదని తెలిపింది.  మలబార్‌లో 40 రకాల కులాలు వున్నాయి. వాటిని ఎలా గుర్తిస్తారు? అంటూ సందేహం వ్యక్తం చేసింది. 
 
 ‘పొవార్‌’, ‘పవార్‌’ కులాల గురించి నమోదు చేసేటప్పుడు ఒబిసి కేటగిరిలో ఉను పొవార్‌ లను పవార్‌ గా పేర్కొంటే కొంపలంటుకుంటాయని పేర్కొన్నది. అలాగే ఒక రాష్ట్రంలో ఎస్సీలుగా ఉన్నవారు మరో రాష్ట్రంలో ఒబిసి జాబితాలో ఉంటారని పేర్కొంటూ కుల గణన వల్ల ఎదురయ్యే చిక్కులను ఏకరువుపెట్టింది. 
 
కేంద్రంలో అందుబాటులో ఉన్న మహారాష్ట్రలోని ఒబిసిల లెక్కల గురించి సమాచారం కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో చేసిన అభ్యర్థనను సైతం కేంద్రం వ్యతిరేకించింది. 

కాగా, 2021 జనాభా లెక్కల సేకరణలో భాగంగా కుల గణన చేపట్టాలని ప్రతిపక్షాలతో పాటు పలు బిజెపి మిత్ర పక్షాలు సైతం డిమాండ్‌ చేస్తున్నాయి. బీహార్‌లో బిజెపి మిత్రపక్షమైన జెడి (యు), ఆర్జేడితో కలసి ఇప్పటికే కేంద్రంకు విజ్ఞప్తి చేసింది. ఒడిశా, జార్ఖండ్‌ రాష్ట్రాల అసెంబ్లీలు కుల గణన చేపట్టాల్సిందేనని తీర్మానాలు ఆమోదించాయి.