
కరోనాతో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు పరిహారం, డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలన్న నిర్ణయంపై కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశంసించింది. ప్రపంచంలో ఏ దేశం చేయని పని భారత్ చేస్తున్నదని ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
“ఇవాళ మేము చాలా సంతోషంగా ఉన్నాం. కరోనా బాధిత కుటుంబాల కన్నీళ్లు తుడవడానికి కనీసం పరిహారమైనా ఇస్తున్నారు” అని జస్టిస్ ఎంఆర్ షా పేర్కొన్నారు. కరోనా వైరస్ మహమ్మారిపై భారత్ స్పందించిన తీరును కూడా జస్టిస్ షా, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం కొనియాడింది.
“ఆర్థికపరమైన పరిమితులు ఎప్పుడూ ఉన్నాయని మాకు తెలుసు. ప్రభుత్వాలు ఇతర పనులు కూడా చేయాల్సి ఉంటుంది. వాటిని కూడా ఇప్పుడు చేస్తూనే ఉన్నాయి. అధిక జనాభా, ఆర్థిక పరిమితుల సమస్యలు ఉన్నా కూడా.. ఈ పని చేస్తున్నారు. భారత్ చేస్తున్నది ఏ దేశం కూడా చేయలేదు” అని జస్టిస్ షా అభినందించారు.
కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేలు ఇవ్వాలని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సిఫార్సు చేసినట్లు బుధవారం సుప్రీంకోర్టుకు చెప్పింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా ఎన్‌డీఎంఏ జారీ చేసినట్లు తెలిపింది. తొలి, మలి దశ కరోనా సమయంలో చనిపోయిన వారికే కాదు.. ఇది భవిష్యత్తులోనూ కొనసాగుతుందని కూడా ఆ మార్గదర్శకాల్లో ఎన్డీఎంఏ స్పష్టం చేసింది.
More Stories
ఛత్తీస్గఢ్లో 1040 మంది మావోయిస్టులు లొంగుబాటు
కరూర్ తొక్కిసలాటపై సీబీఐ విచారణకు సుప్రీం ఆదేశం
మూడో తరగతి నుంచే ఏఐ!