దీక్షకు తీసుకొచ్చి కూలీలకు డబ్బులివ్వలే…. షర్మిల అరెస్ట్ 

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టనున్న దీక్ష కోసం తమను తీసుకొచ్చి డబ్బులివ్వడం లేదని ఆరోపిస్తూ అడ్డా కూలీలు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన పీర్జాదిగూడలో చోటు చేసుకున్నది. మంగళవారం బోడుప్పల్‌లో ఎగ్జిబిషన్‌ మైదానంలో వైఎస్‌ షర్మిల నిరుద్యోగ దీక్ష ఏర్పాటు చేశారు.

దీక్ష కోసం కెనరా నగర్ బస్టాండ్‌ వద్ద ఉన్న అడ్డా కూలీల వద్దకు ఆ పార్టీకి చెందిన రాఘవరెడ్డి వెళ్లి సాయంత్రం 6 గంటల వరకు దీక్ష కూర్చుంటే ఒక్కొక్కరికి రూ.400 చొప్పున ఇస్తామని చెప్పారు. ఇందుకు వారు అంగీకరించడంతో 50 మందిని బస్సులో దీక్షాస్థలికి తరలించారు. అయితే, దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు అందరినీ అక్కడి నుంచి వెళ్లగొట్టారు. తమకు కూలీ డబ్బులివ్వాలని మహిళలు పార్టీ కోరగా.. ఆ పార్టీ నేతలు అక్కడి నుంచి జారుకున్నారు.

డబ్బులు ఇస్తానని చెప్పి మోసం చేశారని ఆరోపిస్తూ పార్టీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనను మీడియా కవర్‌ చేస్తుండడం గమనించిన నేతలు.. ఆ తర్వాత వచ్చి మహిళలను శాంతింపజేశారు.

మరోవంక, వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిలను మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. షర్మిల దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో బోడుప్పల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద ఉదయం ఉద్రిక్తత నెలకొంది.  మొదటగా ఆత్మహత్య చేసుకున్న రవీంద్ర కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అనుమతి నిరాకరించినా నగరంలోని బోడుప్పల్‌లో దీక్షకు కూర్చున్నారు. 

సాయంత్రం వరకూ దీక్ష కొనసాగుతుందని ప్రకటించారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు అక్కడికి తరలివచ్చారు. తాము శాంతియుతంగా దీక్ష చేయాలనుకుంటే.. ఎందుకు అనుమతివ్వలేదని ప్రశ్నించేందుకు తర్వాత ఆమె మేడిపల్లి పీఎస్‌కు బయలుదేరారు. అక్కడ పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో షర్మిల, ఆమె పార్టీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.

దీంతో పోలీసులు షర్మిలను అరెస్టు చేశారు. విషయం తెలియడంతో మేడిపల్లి పీఎస్‌కు  వైఎస్సార్ టీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. దీంతో షర్మిలను పోలీసులు ఘటకేశ్వర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వందల మంది నిరుద్యోగులను పొట్టనపెట్టుకున్న హంతకుడు కేసీఆర్ అని… షర్మిల మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నామనే.. తమ దీక్షకు అనుమతి ఇవ్వలేదని ఆమె ధ్వజమెత్తారు.