రేవంత్‌‌పై కేటీఆర్‌ పరువు నష్టం దావా

ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రి కేటీఆర్ లమధ్య కొద్దీ రోజులుగా ఆరోపణలు, ప్రత్యారోపణలతో పరస్పరం ట్వీట్ లు చేసుకొంటూ రాజకీయ కలకలం రేపుతున్నారు. కేటీఆర్ విసిరిన సవాల్‌ను స్వీకరించి రేవంత్ నేడు గన్‌పార్క్‌కు చేరుకున్నారు. ఇటు ఈ పరిణామాలన్నీ జరుగుతుండగానే రేవంత్‌పై కేటీఆర్ పరువునష్టం దావా వేశారు.
సిటీ సివిల్‌కోర్టులో  రేవంత్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్‌ పరువు నష్టం దావా వేశారు. తనకు సంబంధంలేని విషయాల్లో దురుద్దేశపూర్వకంగా.. తన పేరును వాడుతున్నారని కేటీఆర్‌ పిటిషన్‌‌లో పేర్కొన్నారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిని శిక్షించాలని కోరారు. రేవంత్ రెడ్డి గత కొంత కాలంగా తనపైన అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. 
 ప్రస్తుతం డ్రగ్స్‌ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరవుతున్న.. వ్యక్తులతో కానీ ఆయా కేసులతో కానీ తనకు ఎలాంటి సంబంధమూ లేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. పరువు నష్టానికి తగిన పరిహారం చెల్లించడంతో పాటు.. క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోర్టును మంత్రి కోరారు. రేవంత్‌రెడ్డిని తగిన విధంగా కోర్టు శిక్షిస్తుందని కేటీఆర్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.
అయితే, ఎక్సైజ్ శాఖ విచారణ నివేదికను ఎందుకు ఈడీకి ఇవ్వడం లేదు? ఐపీఎస్‌ అధికారి అకున్ సభర్వాల్ కమిటీ ఏమైంది? అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. 
 
‘అకున్ సబర్వాల్‌కి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. డ్రగ్స్ కేసు విచారణలో ఉండగానే అకున్ సబర్వాల్‌ని తప్పించారు. బంజారాహిల్స్, మాదాపూర్, కొండాపూర్ వరకూ పబ్బులు వ్యాప్తి చెందాయి. విదేశాల నుంచి వచ్చిన డ్రగ్స్, గంజాయి వాడకం ఎక్కువైంది. కేటీఆర్‌కి బాధ్యత లేదా? పిల్లలు డ్రగ్స్ మహమ్మారి బారిన పడుతుంటే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత లేదా? కేటీఆర్ ఎదురు దాడి చేస్తున్నారు’’ అని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.