మహిళా మంత్రిత్వ శాఖలో మహిళా ఉద్యోగుల నిషేధం

ఆఫ్ఘనిస్థాన్‌ను మరోసారి తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు మహిళలపై వివక్షను కొనసాగిస్తున్నారు. వారి హక్కులను హరిస్తున్నారు. తాజాగా మహిళా మంత్రిత్వ శాఖలో పని చేసే నలుగురు మహిళా ఉద్యోగులను కాబూల్‌లోని ఆ శాఖ కార్యాలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. 

కేవలం పురుష ఉద్యోగులను మాత్రమే అనుమతిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ దేశ మహిళా వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన మహిళా ఉద్యోగులపై తాలిబన్లు నిషేధం విధించినట్లు ఆ శాఖకు చెందిన ఒక అధికారి తెలిపారు. మరోవైపు ఈ చర్యను నిరసిస్తూ మహిళా ఉద్యోగులు మహిళా మంత్రిత్వ శాఖ కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు.  20 ఏండ్ల తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్ల గత పాలనపై ఆ దేశ మహిళలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఇస్లామిక్ పాలనలో మహిళలపై రాళ్లు రువ్వడం, విచ్ఛేదనం, బహిరంగ ఉరిశిక్షలు, తుపాకీతో కాల్చివేయడం వంటి దారుణాలను గుర్తు చేసుకుని ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు.  తమ హక్కుల కోసం కొందరు మహిళలు ఇటీవల నిరసన తెలుపగా తాలిబన్లు వారిని కొరడాలు, లాఠీలతో దారుణంగా కొట్టారు.

తమ దేశంలో స్త్రీలను జంతువుల కన్నా హీనంగా చూస్తున్నారని ఆఫ్ఘన్‌కు చెందిన పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.  స్త్రీలను తాలిబన్లు మనుషులుగా కాకుండా జంతువులుగా చూస్తున్నారని మండిపడ్డారు.  న్యూఢిల్లీలోని భారతీయ మహిళా ప్రెస్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆఫ్ఘన్  పార్లమెంటు మాజీ సభ్యురాలు షింకాయ్  కరోఖైల్‌ మహిళలపట్ల తాలిబన్ల వైఖరిపై ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం మహిళల పరిస్థితి దారుణంగా ఉందని, అక్కడి పరిస్థితులు భయంకరంగా ఉన్నాయని.. చాలామంది మహిళా కార్యకర్తలు, రాజకీయ నేతలు చిక్కుకుపోయారని ఆమె తెలిపారు. తాలిబన్లు వారి ఇళ్లకు వెళ్లి మరీ భయపెడుతున్నారని, వారి కార్లను స్వాధీనం చేసుకుంటున్నారని ఆమె చెప్పారు. మహిళలను గొంతెత్తనివ్వడం లేదని వివరించారు.

పరిశోధకురాలు, హక్కుల కార్యకర్త హుమెరా రిజాయ్  మాట్లాడుతూ 1990ల్లో ఆఫ్ఘన్‌లో తాలిబన్‌లు అధికారంలో ఉన్నప్పుడు మహిళలపై దాడులకు పాల్పడ్డారని, వారి హక్కులను కాలరాశారని, హత్యలు చేశారని గుర్తు చేశారు.  2001 నుండి మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు ఎంతో శ్రమపడ్డారని, ఇప్పుడు అదంతా వృద్దా అవుతోందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తాలిబన్‌లు మహిళలను జంతువులుగా చూస్తున్నారని జర్నలిస్ట్‌ ఫాతిమా ఫరమార్జ్‌ పేర్కొన్నారు.