చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతల దాడి

అమరావతిలోని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటిపై వైసీపీ నాయకులు శుక్రవారం దాడికి పాల్పడ్డారు. వైసీపీ నేతలు జెండాలు, కర్రలతో బాబు ఇంటి వద్దకు వచ్చారు. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ కూడా అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

సిఎం జగన్‌ పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదంటూ  జోగి రమేష్‌ ధర్నాకు సిద్ధపడటంతో విషయం తెలుసుకున్న టిడిపి కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. వైసిపి కార్యకర్తలను టిడిపి వర్గీయులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత తీవ్రమయ్యింది. పెద్ద ఎత్తున చేరుకున్న టిడిపి-వైసిపి కార్యకర్తలు కర్రలతో ఒకరిపైఒకరు దాడిచేసుకున్నారు.

గురువారం మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ నేతలు అందోళన చేపట్టారు. చంద్రబాబు క్షపాపణ చెప్పలని డిమాండ్ చేశారు. ఇంటిపై దాడికి యత్నించడంతో టీడీపీ నేతలు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. వైసీపీ నేతల దాడిలో టీడీపీ నేత బుద్దా వెంకన్న స్పృహ తప్పి పడిపోయారు.

వైసీపీ నేతలు దాదాపు పది కార్లతో రాళ్లు, కర్రలతో దాడికి తెగబడ్డారని టీడీపీ నేతలు వాపోయారు. చంద్రబాబు ఇంటి వద్ద జోగి రమేష్, టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. వైసీపీ నాయకులకు డీజీపీ కూడా సహకరిస్తున్నారని ఆరోపించారు.  ఇంత జరుగుతున్నా పోలీసులు  పట్టించుకోవడం లేదని  మండిపడ్డారు.
పట్టాభి మాట్లాడుతూ ఫ్యాక్టనిస్టు సీఎం అయితే ఇలానే ఉంటుందని మండిపడ్డారు. వైసీపీ నాయకులు ముందుగానే ప్రకటించి దాడికి పాల్పడుతుంటే.. పోలీసులు ఏం చేస్తున్నారని టీడీపీ శ్రేణులు ప్రశ్నించాయి. సీఎం ప్రోద్భలంతోనే ఇలా చేస్తున్నారని ఆరోపించారు.