
బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నేషనల్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌ఆర్‌సిఎల్) పేరుతో ఏర్పాటు చేయనున్న దీని కోసం రూ.30,600 కోట్ల హామీకి ప్రభుత్వం ముందుకు వచ్చిందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
మొండి బకాయిల సంక్షోభం నుంచి బ్యాంకులు తట్టుకొని నిలిచేందుకు దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ బ్యాంక్ జారీ చేసే సెక్యూరిటీ రసీదుల కోసం రూ.30,600 కోట్ల వరకు ప్రభుత్వ గ్యారెంటీని ఆమోదించినట్లు వెల్లడించారు. ఈ హామీ ఐదు సంవత్సరాల పాటు అమలులో ఉంటుందని చెప్పారు.
దీనికి సంబంధించి బుధవారం ప్రధాని అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్‌లో ఆమోదం లభించింది. గత ఆరు ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు రూ.5,01,479 కోట్లు రికవరీ చేసినట్లు మంత్రి తెలిపారు. ఇందులో రూ.3.1 లక్షల కోట్లు 2018 మార్చి నుంచి రికవరీ చేయబడ్డాయని ఆమె పేర్కొన్నారు.
ఏదైనా ఎన్‌పిఎ కొనుగోలుకు సంబంధించి ప్రవేశ విలువలో నష్టం జరిగితే ప్రభుత్వ హామీ భరోసాగా ఉంటుందని ఆర్ధిక మంత్రి తెలిపారు. 2021-22 బడ్జెట్ ప్రసంగంలో బ్యాడ్ బ్యాంకు ఏర్పాటు విషయాన్ని ప్రస్తావించారు. తొలి దశలో ఎన్‌ఆర్‌సిఎల్‌కు బదిలీ చేసే రూ.90,000 కోట్ల 22 బ్యాడ్ లోన్ ఖాతాలను బ్యాంకులు గుర్తించాయి.
ప్రతిపాదిత బ్యాడ్ బ్యాంక్ రూ.500 కోట్లు లేదా అంతకన్నా ఎక్కువ విలువైన ఆస్తులను మాత్రమే పరిష్కరించేందుకు వీలుంది. దాదాపుగా రూ.2 లక్షల కోట్ల విలువ చేసే ఎన్‌పిఎలు పరిష్కారానికి రానున్నాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ బ్యాడ్ బ్యాంకులో లీడ్ స్పాన్సర్‌గా 12 శాతం స్టేక్‌తో కెనరా బ్యాంకు వ్యవహరించనున్నది. ప్రభుత్వ రంగ బ్యాంకులు అన్ని కలిసి ఎన్‌అర్‌సిఎల్‌లో 51 శాతంను కలిగి ఉంటాయి.
More Stories
నవంబరు 23న భారత్‌కు నీరవ్ మోదీ?
500 బిలియన్ డాలర్ల సంపద కలిగిన తొలి వ్యక్తిగా ఎలాన్ మస్క్
దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా రోష్ని నాడార్