భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి

భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మనకు ప్రజాస్వామ్యం అనేది కేవలం రాజ్యాంగ నిర్మాణం మాత్రమే కాదని, ఒక స్ఫూర్తి, ‘జీవన ధార’ అని ఆయన తెలిపారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ ఎం వెంకయ్య నాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో కలిసి ప్రధాని మోదీ పార్లమెంట్ టీవీ (సంసద్ టీవీ)ని బుధవారం ఢిల్లీలో ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం రోజున ‘సంసద్ టీవీ’ని ప్రారంభించడం మరింత సందర్భోచితంగా ఉందని పేర్కొన్నారు. ‘ప్రజాస్వామ్యం విషయానికి వస్తే, భారతదేశ బాధ్యత పెరుగుతుంది. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి. మనకు ప్రజాస్వామ్యం అనేది కేవలం రాజ్యాంగ నిర్మాణం మాత్రమే కాదు, స్ఫూర్తి, అది ‘జీవన ధార’’ అని కొనియాడారు.

కొన్నేండ్లుగా మీడియా పాత్ర కూడా మారిపోయిందని, ఇది విప్లవాన్ని తీసుకువస్తున్నదని ప్రధాని మోదీ తెలిపారు. అందుకే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా మీడియా కూడా మారడం చాలా ముఖ్యమని చెప్పారు. ఈ నేపథ్యంలో ‘సంసద్ టీవీ’ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌, సోషల్ మీడియాలో అందుబాటుతోపాటు యాప్ కూడా ఉంటుందని వివరించారు.

పార్లమెంటు కార్యకలాపాలను విస్తృత స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా సంసద్ టీవీని ప్రారంభించారు.  సంసద్ టీవీలో కార్యక్రమాలు ముఖ్యంగా నాలుగు రకాలుగా ప్రసారమవుతాయి. పార్లమెంటు, ప్రజాస్వామిక వ్యవస్థల కార్యకలాపాలు; పథకాలు, విధానాల అమలు, పాలన; భారత దేశ చరిత్ర, సంస్కృతి; సమకాలిక స్వభావంగల సమస్యలు, ఆసక్తులపై కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

లోక్‌సభ టీవీ, రాజ్యసభ టీవీలను కలిపి ఒకే చానల్‌ను ఏర్పాటు చేయడానికి ప్రసార భారతి సీఈఓ సూర్య ప్రకాశ్ నేతృత్వంలోని కమిటీ ఆమోదం తెలిపింది. లోక్‌సభ టీవీ 2006 జూలైలో ఏర్పాటైంది. లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ ఆలోచనల మేరకు దీనిని ఏర్పాటు చేశారు. రాజ్యసభ టీవీ 2011లో ప్రారంభమైంది. ఈ చానల్‌లో రాజ్యసభ కార్యకలాపాలతోపాటు విజ్ఞానదాయక కార్యక్రమాలు కూడా ప్రసారమవుతుండేవి.