చచ్చాడనుకున్న అల్ ఖైదా చీఫ్ బతికే ఉన్నాడు!

చ‌నిపోయాడ‌నుకున్న అల్‌ఖైదా చీఫ్ అయ్‌మాన్ అల్‌-జ‌వ‌హిరి బ‌తికే ఉన్నాడు. తాజాగా 9/11 దాడి జ‌రిగి 20 ఏళ్ల పూర్త‌యిన సంద‌ర్భంగా అత‌డు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. అల్‌ఖైదా అధికారిక మీడియా అస్‌-స‌హ‌బ్ ఈ 60 నిమిషాల వీడియోను పోస్ట్ చేసింది.

అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ మరణం తరువాత ఈజీప్టుకు చెందిన అయ్మాన్ అల్ జవహరీ ఉగ్రవాద సంస్థకి నాయకుడయ్యాడు. కానీ, ఒకప్పటిలా ప్రపంచాన్ని గడగడలాడించలేకపోయింది అల్ ఖైదా. ఇక కొన్నాళ్ల క్రితం వయసు రిత్యా వచ్చిన అనారోగ్యల కారణంగా జవహరీ తుది శ్వాస విడిచాడని మీడియాలో ప్రచారం జరిగింది. 

కానీ, ఆ వార్తల్ని తప్పని నిరూపించేలా ఇప్పుడు అల్ ఖైదా చీఫ్ ఓ వీడియో సందేశం విడుదల చేశాడు. జ‌వ‌హిరి  చాలాకాలంగా అండ‌ర్‌గ్రౌండ్‌లోనే ఉన్నాడు. గ‌తేడాది న‌వంబ‌ర్‌లో అత‌డు అనారోగ్యంతో మ‌ర‌ణించిన‌ట్లు కూడా వార్తలు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత అత‌ని నుంచి వీడియో బ‌య‌ట‌కు రావ‌డం ఇదే తొలిసారి.

శ‌నివారం విడుద‌లైన ఈ వీడియోలో జ‌వ‌హిరి పూర్తి ఆరోగ్యంతో క‌నిపించాడు. సెప్టెంబ‌ర్ 11 ఉద‌యం నుంచీ కొన్ని టెలిగ్రామ్ చానెళ్ల‌లో ఈ వీడియో వ‌స్తోందంటూ అస్‌-స‌హ‌బ్ ప్రోమోలు న‌డిపించింది. ఆ త‌ర్వాత ఓ టెలిగ్రామ్ చానెల్ ద్వారానే జ‌వ‌హిరి రాసిన 852 పేజీల బుక్‌ను రిలీజ్ చేసింది అల్‌ఖైదా. 

ఈ 60 నిమిషాల వీడియోలో ఒక్క‌చోట మాత్ర‌మే అత‌డు ఆఫ్ఘ‌నిస్థాన్ గురించి ప్రస్తావించాడు. 20 ఏళ్ల యుద్ధం త‌ర్వాత అమెరికా పూర్తిగా కుంగిపోయి మ‌ళ్లీ ఇంటిదారి ప‌ట్టింద‌ని అన్నాడు. 9/11 దాడుల్లో పాల్గొన్న 19 మంది అల్‌ఖైదా ఉగ్ర‌వాదుల‌ను అత‌డు ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నాడు.

అయితే, తాలిబన్లు అఫ్గాన్ ని స్వాధీనం చేసుకోవటం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇదే జవహరి వ్యవహారంలో కొత్త అనుమానాలకి తావిస్తోంది.  అమెరికా తన సైన్యాన్ని అఫ్గాన్ నుంచీ ఉప సంహరించటం కొన్ని నెలల క్రితమే తీసుకున్న నిర్ణయం. కాబట్టి అల్ జవహరి అప్పట్లోనే వీడియో సందేశం రికార్డ్ చేసి ఉంటాడని కొందరు భావిస్తున్నారు.

అఫ్గాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న సమయానికి ఆయన బతికి ఉన్నాడా లేదా అన్నది ఇంకా అనుమానమే. మరో వైపు, అల్ ఖైదా చీఫ్ ఒకవేళ సజీవంగా ఉన్నా కూడా వ్యూహాలు పన్నటంలో అతడి పాత్ర ఇప్పుడు పెద్దగా ఉండకపోవచ్చని ఐక్య రాజ్య సమితి అంచనా వేస్తోంది. ముసలి వాడు కావటమే ఇందుకు కారణమని నిఘా విభాగాల నిపుణులు అంటున్నారు.