ఇందిరపై అలహాబాద్ హైకోర్టు తీర్పుతో మరో చరిత్ర

నాటి ప్రధాని ఇందిరాగాంధీపై అనర్హత వేటు వేస్తూ 1975 నాటి అలహాబాద్ హైకోర్టు తీర్పు దేశ చరిత్రను మార్చిందని, నిష్పక్షపాత న్యాయవ్యవస్థల స్వరూపాన్ని చాటిందని ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ తెలిపారు. అలహాబాద్ హైకోర్టు నూతన భవన ప్రాంగణ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటూ అప్పటి అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జగ్‌మోహన్‌లాల్ సిన్హా అప్పటి ప్రధాని ఇందిరా గాంధీపై వచ్చిన ఎన్నికల అక్రమాల అభియోగాలపై విచారణ తరువాత ఎంతో ధైర్యంగా తీర్పు వెలువరించారని కొనియాడారు. 

ప్రధాని ఇందిరపై అనర్హత వేటు వేసిన ఈ తీర్పు దేశవ్యాప్తంగా సంచలనాత్మకం అయిందని, అత్యయిక పరిస్థితి విధింపునకు దారితీసిందని గుర్తు చేశారు. ఈ విధంగా అలహాబాద్ హైకోర్టు ఉన్నత ప్రమాణాల తీర్పులను సంతరించుకుని ఉన్న 150 ఏళ్ల చరిత్రను సంతరించుకుందని తెలిపారు. ప్రధాని ఇందిరను అనర్హురాలిగా ప్రకటించడం ద్వారా న్యాయమూర్తి తమ ధైర్యాన్ని చాటుకున్నారని ప్రశంసించారు. 

తరువాత దేశంలో ఎటువంటి పరిణామాలు జరిగాయనే అంశం జోలికి తాను వెళ్లదల్చుకోలేదని చెబుతూ అలహాబాద్ హైకోర్టు నుంచి ఎందరో ప్రఖ్యాత న్యాయవాదులు, న్యాయమూర్తులు సేవలను అందించారని గుర్తు చేశారు. హైకోర్టు ఆవరణలో దివంగత ప్రముఖ న్యాయవాది ఆనంద్ భూషణ్ శరన్ చిత్రపటాన్ని ఈ సందర్భంగానే ప్రధాన న్యాయమూర్తి ఆవిష్కరించారు.

కోర్టుల శిథిలావస్థ బాధాకరం

దేశంలోని న్యాయస్థానాల కార్యాలయాల శిథిలావస్థ బాధాకరం అని జస్టిస్ రమణ వ్యాఖ్యానించారు. బ్రిటిష్ వారి పాలన తరువాత కోర్టులను గాలికొదిలినట్లుగా వ్యవహరించడం మరీ దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నేళ్లు అయినా దేశంలోని న్యాయస్థానాల నిర్వాహక కేంద్రాలు దయనీయ స్థితిలో ఉన్నాయని,  అవి దెబ్బతిని ఉన్నా వాటిలోనే నిర్వహక కార్యక్రమాలు సాగించాల్సి వస్తోందని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. 

అలహాబాద్‌లో నేషనల్ లా యూనివర్శిటీకి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కలిసి శంకుస్థాపన, ఇతర కార్యక్రమాలలో ఆయన పాల్గొంటూ బ్రిటిష్ పాలన తరువాత న్యాయవ్యవస్థ నిర్వహణ సంబంధిత విషయంలో ఈ విధంగా తీవ్రస్థాయిలో నిర్లక్షం వహించడం కొట్టొచ్చే పరిణామం అయిందని పేర్కొన్నారు.

న్యాయస్థానాలకు మౌలిక నిర్మాణ వ్యవస్థ సరైన విధంగా ఉండేందుకు వీలుగా వెంటనే నేషనల్ జుడిషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఎన్‌జెఐసి) ఏర్పాటు చేయాలని సూచించారు. దెబ్బతిని ఉన్న కోర్టులలో విచారణలు జరగడం, ఎటువంటి సౌకర్యాలు లేని స్థితిలో ఉన్న వాటిలో లాయర్లు, కక్షిదారులు ఉండాల్సి రావడం చేదు అనుభవాలనే అందిస్తుందని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. కోర్టులలో ఇబ్బందికరమైన వాతావరణంలో పనిచేయాల్సి రావడం వల్ల కోర్టు సిబ్బందికి, న్యాయమూర్తులకు తమ విధుల సమర్థవంత నిర్వహణలో ఇబ్బందులు ఏర్పడుతాయని తెలిపారు.

గౌరవనీయ రాష్ట్రపతి కోవింద్ తీసుకుంటున్న చర్యలతో పేదలకు న్యాయం అందుబాటులోకి వస్తోందని ప్రధాన న్యాయమూర్తి కొనియాడారు. రాష్ట్రపతి తరచూ పేద కక్షిదారుల తరఫున గళమెత్తుతుని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ వారికి అందుబాటులోకి రావడానికి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. 

ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీర్పులను పలు ప్రాంతీయ భాషలలోకి తర్జుమా చేసే ఆలోచన రాష్ట్రపతిదే అని గుర్తు చేశారు. ఇటువంటి ఏర్పాటుతో సామాన్యుడికి కూడా న్యాయవ్యవస్థ పట్ల, తీర్పులలోని అంశాల పట్ల సరైన అవగావహన ఏర్పడుతుందని, దీనిని ఇప్పుడు ఆచరణలో పెట్టామని తెలిపారు.