70 కోట్ల మందికి కరోనా టీకాలు ఇచ్చేశాం

70 కోట్ల మందికి కరోనా టీకాలు ఇచ్చేశాం
కరోనా టీకాలలో కొత్త మైలురాయిని అందుకున్నాం. ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు 70 కోట్ల మంది క‌రోనా టీకాలు ఇచ్చేశారు. ఈ విష‌యాన్ని కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మ‌న్సూక్ మాండ‌వీయ తెలిపారు. అయితే గ‌డిచిన 13 రోజుల్లోనే ప‌ది కోట్ల మంది కోవిడ్ టీకాలు ఇచ్చిన‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. 
 
ప్ర‌ధాని మోదీ నాయ‌క‌త్వంలో కరోనా టీకాల ప్ర‌క్రియ జోరుగా సాగుతున్న‌ట్లు తన ట్విట్టర్ లో మంత్రి తెలిపారు. ఈ ఘ‌న‌త సాధించినందుకు హెల్త్ వ‌ర్క‌ర్ల‌కు, ప్ర‌జ‌ల‌కు మంత్రి మాండ‌వీయ కృతజ్ఞతలు చెప్పారు. తొలి ప‌ది కోట్ల డోసుల‌ను 85 రోజుల్లో, 20 కోట్ల టీకాల‌ను 45 రోజుల్లో, 30 కోట్ల డోసుల‌ను 29 రోజుల్లో, 40 కోట్ల డోసుల‌ను 24 రోజుల్లో, 50 కోట్ల డోసుల‌ను 20 రోజుల్లో, 60 కోట్ల డోసుల‌ను 19 రోజుల్లో, ఇక 70 కోట్ల డోసుల‌ను 13 రోజుల్లో ఇచ్చిన‌ట్లు మంత్రి తెలిపారు.
రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు ఇప్ప‌టివ‌రకు 69.51 కోట్ల కరోనా టీకాలను స‌మ‌కూర్చిన‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. మ‌రో 77,93,360 వ్యాక్సిన్ డోసులు మార్గ‌మ‌ధ్యంలో ఉన్నాయ‌ని, త్వ‌ర‌లో అవి కూడా రాష్ట్రాల‌కు చేరుకుంటాయ‌ని ఆరోగ్య‌శాఖ తెలిపింది. ప్ర‌స్తుతం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వ‌ద్ద ఇంకా 5.31 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయ‌ని వెల్ల‌డించింది.

ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 69,51,79,965 వ్యాక్సిన్ డోసుల‌ను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల‌కు స‌మ‌కూర్చాం. మ‌రో 77,93,360 వ్యాక్సిన్ డోసులు రాష్ట్రాల‌కు చేరుకోనున్నాయి. ప్ర‌స్తుతం రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల వ‌ద్ద 5,31,15,610 వినియోగించ‌ని వ్యాక్సిన్ డోసులు ఉన్నాయి అని కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ పేర్కొన్న‌ది. జాతీయస్థాయి వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌లో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు ఉచితంగా వ్యాక్సిన్‌ల‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ది.

భారీగా తగ్గిన కరోనా కేసులు 
 
దేశంలో కరోనా కేసులు, మరణాలు భారీగా తగ్గడం ఉపశమనాన్ని కలిగిస్తోంది. తాజాగా  24 గంటల వ్యవధిలో 31 వేల మందికి కరోనా  పాజిటివ్‌గా నిర్ధారణవ్వగా. మరణాలు 300 దిగువకు తగ్గాయి. వరుసగా రెండో రోజు కొత్త కేసుల కంటే కోలుకున్నవారే ఎక్కువగా ఉండటం గమనార్హం.

కేరళలోనూ కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఆ రాష్ట్రంలో నిన్న 19,688 కేసులు, 135 మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 15 లక్షలకుపైగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా  31,222 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.30 కోట్లు దాటింది. ఇదే సమయంలో 42,942 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. 

 
నిన్న 290 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 4,41,042 మంది మృతి చెందారు. ఇక కొత్త కేసులు తగ్గుముఖం పట్టడంతో క్రియాశీల కేసుల సంఖ్య మరోసారి 4 లక్షల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,92,864 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 1.19 శాతంగా ఉంది.