పెన్షన్లు, రేషన్ కార్డుల్లో జగన్ ప్రభుత్వం భారీ కోత 

పేదలకు ఇస్తున్న సామాజిక పెన్షన్లు, పేదలకు నిత్యావసర వస్తువులను సరఫరా చేసే రేషన్ కార్డులలో  వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం భారీగా కోత విధిస్తున్నది. ఎటువంటి ముందు సమాచారం లేకుండా పొంతనలేని సమాధానాలతో అర్ధాంతరంగా నిలిపివేస్తున్నది. ఆగస్టు నెలలో 60.50లక్షల పెన్షనర్లకు రూ.1,455.87కోట్లు ఇచ్చిన ప్రభుత్వం సెప్టెంబర్‌లో 59.18లక్షల మందికి పెన్షన్లు ఇచ్చింది. దీనికి చేసిన ఖర్చు రూ.1,382.63కోట్లు. కేవలం ఒక్క నెలలోనే 1,32,000 పెన్షన్లను నిలిపివేసింది. 
 
పెన్షన్‌కు దరఖాస్తు చేసుకున్నపుడే సదరం సర్టిఫికెట్‌ సమర్పించి, తద్వారా అర్హత పొందిన పెన్షనర్లకు సెప్టెంబర్‌ నెలలో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే పెన్షన్‌లో ప్రభుత్వం కోతలు విధించింది. ప్రశ్నించిన వారికి మీరు గతంలో వికలాంగులే..ప్రస్తుతం కోలుకున్నారు కదా..అందుకే పెన్షన్‌లో కోత పెట్టిందని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు సమాధానాలిస్తున్నారు. 
 
వికలాంగులమై పనులకు వెళ్లలేక పోతున్నాం, పెన్షన్‌పైనే ఆధారపడ్డాం సార్‌..మాపై కనికరం చూపండని వేడుకున్నా ఫలితం ఉండడం లేదని వికలాంగ పెన్షనర్లు ఆవేదన చెందుతున్నారు. రకరకాల కారణాలతో రేషన్‌ కార్డులు నిలిపివేయడం, రేషన్‌ కార్డులేదనే సాకుతో పెన్షన్‌ నిలిపివేయడం ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ఇకెవైసి విధానంతో రేషన్‌ కార్డులు, పెన్షన్లు నిలిచిపోతున్నాయి.
 
రాష్ట్రంలో వికలాంగులకు, వితంతువులకు, వృద్దులకు కొత్తగా ఇచ్చే పెన్షన్ల ప్రక్రియ నత్తనడక నడుస్తోంది. దరఖాస్తు చేసుకున్న ఒక్క నెలలోపే పూర్తి పారదర్శకత విధానంలో పెన్షన్‌ మంజూరు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా, పెన్షన్ల మంజూరులో అంగుళం కూడా కదలిక లేదు. 
 
అడిగిన వారికి ప్రభుత్వం నుండి నిధులు రావడం లేదు. కొత్త పెన్షన్లకు బడ్జెట్‌ ఇవ్వలేదు అని సమాధానాలు అందుతున్నాయి. దీంతో దరఖాస్తు చేసుకున్న వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు రేషన్‌ కార్డులోని సభ్యుల్లో ఒకరికే పెన్షన్‌ అనే నిబంధనను ప్రభుత్వం విధించింది. దీంతో మరిన్ని పెన్షన్లను ఈనెలలో నిలిపివేసింది. 
 
అర్హులకు సంబంధం లేని కారణాలను చూపి సంవత్సర కాలంగా పెన్షన్‌ నిలిపివేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నిలిపివేసిన పెన్షన్లు, కోత విధించిన పెన్షన్లను పునరుద్దరించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. సిఎం హామీ మేరకు ఎటువంటి షరతులు లేకుండా, అర్హతను బట్టి ప్రతి ఒక్కరికి పెన్షన్‌ ఇవ్వాలని వేడుకుంటున్నారు.